స్మార్ట్ మిథ్యాహ్నం
స్మార్ట్ మిథ్యాహ్నం సత్తెనపల్లి:చంద్రబాబు ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ల పేరు తో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పొట్ట కొట్టేందుకు కుయుక్తులు పన్నుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మధ్యాహ్న భోజనం పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. దీని ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాల్సింది పోయి తమ అనుయాయులకు మేలు జరిగే రీతిలో ప్రభుత్వ పెద్దలు సిద్ధమవుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్ కడప జిల్లాలో విజయవంతం అయ్యాయంటూ స్మార్ట్ కిచెన్ పేరుతో పార్టీ వారి జేబులు నింపేందుకు రంగం సిద్ధం చేసింది. నివేదికల పంపాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేసింది. జిల్లా అధికారులు ఆగమేఘాలపై ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. పైలెట్ ప్రాజెక్టు పేరుతో జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేయనున్నారు. ఒకచోట భోజనం తయా రు చేసి 1 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న విద్యార్థులకు అందించాలన్నది ప్రభుత్వ ఆలోచన.
జిల్లాలోని నరసరావుపేట మున్సిపల్ బాలుర పాఠశాల, సత్తెనపల్లి సుగాలి కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గురజాల ప్రభుత్వ పాఠశాల, మాచర్ల పీడబ్ల్యుడీ కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 1–12 కిలోమీటర్ పరిధిలో ఉన్న పాఠశాలలకు భోజనం అందించాలని, ఆయా పాఠశాల ల్లో స్మార్ట్ కిచెన్లు ఏర్పాటుచేసి చుట్టుపక్కల ఉన్న పాఠశాలలకు భోజనం అందించాలని ప్రణాళిక రూపొందించారు. ఈ నాలుగు స్మార్ట్ కిచెన్లతో ఆయా మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. వాటి పరిధిలో పనిచేసే కార్మికులు సైతం రోడ్డున పడనున్నారు. ఈ పథకాన్ని ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తే ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్న సుమారు 4 వేల పై చిలుకు కార్మిక కుటుంబాలు రోడ్డున పడి పోతా యని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఎక్కడో దూరంలో ఉన్న విద్యార్థులకు ఒకచోట భోజనం వండి వాహనాల్లో తీసుకెళ్లి ఇవ్వడం అన్నది వ్యయప్రయాసలతో కూడుకుంది. దీని వల్ల విద్యార్థులకు వేడి ఆహార పదార్థాలు తినే భాగ్యం లేనట్లే అని ఉపాధ్యాయులు చెబుతున్నారు.ఇప్పటి వరకు పాఠశాల ఆవరణలోనే మధ్యాహ్న భోజనం వండేవారు. ఈ పథకాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయు లు పర్యవేక్షించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కాంట్రాక్టర్లు చేతుల్లోకి పోతుంది. ఎవరిని సంతృప్తి పరచడానికి స్మార్ట్ కిచెన్లు తీసుకొస్తున్నారని ప్రజాసంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. బడుగు, బలహీనవర్గాలకు ఆధారంగా ఉన్న ఈ పథకాన్ని బడా వ్యక్తులకు ఆదాయ వనరుగా ఎందుకు మారుస్తున్నారని నిల దీస్తున్నారు. సొంత పార్టీ నాయకుల బొజ్జలు నింపేందుకే స్మార్ట్ కిచెన్ పథకం రూపకల్పన జరిగిన ట్లు కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా విద్యార్థులకు వేడి ఆహారం అందించడంతోపాటు మధ్యాహ్న భోజన పథకాన్ని నీరు గా ర్చే స్మార్ట్‌కిచెన్‌లకు స్వస్తి పలకాలని కోరుతున్నారు.
● స్మార్ట్ కిచెన్‌ల ద్వారా
మరో దోపిడీకి రంగం సిద్ధం
● తమ అనుయాయుల జేబులు
నింపేందుకు బాబు సర్కార్ కుట్ర
● మధ్యాహ్న భోజన పథకం
కార్మికుల నోట్లో మన్ను
● జిల్లా వ్యాప్తంగా తొలి దశలో
నాలుగు స్మార్ట్ కిచెన్‌లు
పైలట్ ప్రాజెక్టుగా ...
విద్యార్థులకు వేడి ఆహారం లేనట్లే...
పల్నాడు జిల్లాలో 1,188 ప్రాథమిక, 53 ప్రాథమికోన్నత, 280 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 1,25,766 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా 89,439 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం పథకానికి హాజరవుతున్నారు.
1/1
స్మార్ట్ మిథ్యాహ్నం