టీడీపీ జిల్లా అధికార ప్రతినిధిపై కేసు నమోదు
న్యాయవాదిని దూషించిన చల్లా సుబ్బారావు
నరసరావుపేట టౌన్: న్యాయవాదిని దూషించిన టీడీపీ పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావుపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ ఫిరోజ్ శనివారం తెలిపారు. పట్టణానికి చెందిన న్యాయవాది శ్రీరామినేని ప్రసాద్ తనను అసభ్య పరుష పదజాలంతో దూషించాడని వన్‌టౌన్ పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశాడు. గొడవపడుతూ తిట్టిన ఫోన్ ఆడియో రికార్డును అందజేశారు. ఇచ్చిన ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ కావడంతో న్యాయాధికారి నుంచి వచ్చిన అనుమతితో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు
రాజుపాలెం: ఎరువులను అధిక ధరలకు అమ్మినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు తెలిపారు. మండలంలోని గణపవరంలో గల ఎరువులు, పురుగు మందుల దుకాణాలను జిల్లా వ్యవసాయాధికారి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా స్టాక్ రిజిస్టర్, బిల్లు పుస్తకాలు, స్టాక్ డిస్‌ప్లే బోర్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని రైతులకు సూచించారు. దుకాణాదారులు ఎరువులు అమ్మినవెంటనే ఈ–పాస్ తప్పని సరిగా చేయాలని సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి పి.వెంకటనర్సయ్య ఉన్నారు.
ఘనంగా కేఎల్‌యూ స్నాతకోత్సవం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీ 15వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ – ఇండియా అధ్యక్షుడు ప్రొఫెసర్ వినోద్ కె. సింగ్ విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు నిజాయతీగా జీవించడానికి, దేశ అభ్యున్నతి కోసం పనిచేయడానికి ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. టాటా మెమోరియల్ సెంటర్ – ముంబై ఎండీ, ఐఏపీ పీడియాట్రిక్ హిమాటో ఆంకాలజీ విభాగ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ శ్రీపాద్ బనవల్లి గౌరవ అతిథిగా విచ్చేసి విద్యార్థులకు డిగ్రీలను అందజేశారు. వర్సిటీ చాన్స్‌లర్ కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులందరికీ ప్లేస్‌మెంట్ సాధించామన్నారు. వైస్ చాన్సలర్ డాక్టర్ జి. పార్థసారథి వర్మ మాట్లాడుతూ విద్యాభ్యాసం పూర్తిచేసుకున్న 5 వేల మందికి వేడుకలో డిగ్రీలను ప్రదానం చేశామన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ కె. సుబ్బారావు మాట్లాడుతూ గత విద్యాసంవత్సరంలో ప్రతిభ కనబరిచిన 44 మందికి బంగారు, 40 మందికి రజత పతకాలను, నగదు బహుమతులను అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేఎల్‌ఈఎఫ్ కార్యదర్శి కోనేరు శివకాంచనలత, ఉపాధ్యక్షులు కోనేరు రాజా హరీన్, బోర్డు సభ్యురాలు కోనేరు నిఖిల, ప్రో చాన్స్‌లర్, వైస్ చాన్స్‌లర్, ప్రో వైస్ చాన్స్‌లర్లు, అన్ని విభాగాల డీన్లు, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్, విభాగాధిపతులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
రాజధాని రైతుల ఆవేదనకు
నిదర్శనమే రామారావు మరణం
తాడికొండ: రాజధాని రైతుల ఆవేదనకు నిదర్శనమే రైతు రామారావు మరణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబురావు అన్నారు. రాజధానిపై కేంద్ర సర్కార్, చంద్రబాబు ప్రభుత్వాల నిర్లక్ష్యమే దీనికి కారణమన్నారు. శనివారం రామారావు భౌతిక కాయాన్ని మందడంలోని ఆయన నివాసానికి కుటుంబసభ్యులు తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న బాబురావు, పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి వై. నేతాజీ, రాజధాని ప్రాంత కార్యదర్శి ఎం. రవి తదితరులు మందడంలో రామారావు నివాసానికి వెళ్లి భౌతిక కాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
టీడీపీ జిల్లా అధికార ప్రతినిధిపై కేసు నమోదు


