బిత్తరపోయిన ఆర్డీవో !
యడ్లపాడు: ప్రభుత్వ భూముల్లో అక్రమ గ్రావెల్ తవ్వకాలు విచ్చలవిడిగా చేస్తుంటే సమాచారం లేదా అంటూ అధికారులపై ఆర్డీవో మధులత ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం యడ్లపాడు మండలంలో పర్యటించిన ఆర్డీవో, తహసీల్దార్ జెట్టి విజయశ్రీతో కలిసి పలు ప్రభుత్వ భూముల్ని పరిశీలించారు. ఇందులో భాగంగా సంగం గోపాలపురం పరిధిలోని బున్నీనగర్ వెనుక ఉన్న ప్రభుత్వ భూముల వద్దకు వెళ్లారు. కొండవీడు అటవీ భూములు పక్కనే అసైన్డ్ భూముల్లో సర్వే నంబర్ 485/ఎలో భారీ తవ్వకాల ప్రాంతం ఆర్డీవో కంటపడటంతో షాక్ అయ్యారు. తవ్వకాల ప్రాంతాలను, సమీపంలోని క్వారీ కుంటల్ని ఆమె స్వయంగా సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీశారు. తవ్వకాలు జరిగే ప్రాంతంలో ఏకంగా మూడు జేసీబీ యంత్రాలు ఉండటంతో అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతుంటే స్థానిక అధికారులు ఏం చేస్తున్నారని, కనీసం మైనింగ్ శాఖకు ఫిర్యాదు ఎందుకు చేయలేదని అధికారులను నిలదీశారు. తవ్వకాల్లో ఉన్న మూడు జేసీబీలను వెంటనే పోలీస్ స్టేషన్‌న్‌కు తరలించాలని ఆదేశించారు. తన అనుమతి లేకుండా వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దని స్పష్టం చేశారు.
భారీగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు
అధికారులపై ఆగ్రహం..
జేసీబీలు సీజ్ చేయాలంటూ ఆదేశం
తనకు తెలియకుండా
వదలొద్దంటూ హెచ్చరిక


