ఉచిత న్యాయసహాయం అందేలా చూడండి
నరసరావుపేట టౌన్: అర్హులైన వారికి ఉచిత న్యాయ సహాయం అందేలా కృషి చేయాలని న్యాయమూర్తి ఎన్.లావణ్య అధికారులను కోరారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం న్యాయస్థాన భవన ఆవరణలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ విద్యా సంవత్సరంలో వెనుకబడిన పిల్లలు, అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి సరైన వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన పిల్లలకు న్యాయ సహాయం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. తల్లిదండ్రులను చైతన్య పరిచేలా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ హైమాదేవి, డాక్టర్ షాహిద్, కుమారి, హుస్సేన్, వెంకటపతి, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని ఇస్లాంపేట సచివాలయంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిషేధ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో న్యాయవాది ప్రసాద్ వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
సమీక్షా సమావేశంలో న్యాయమూర్తి లావణ్య


