పచ్చికబయళ్లలో.. ఆక్రమణల మేత! | - | Sakshi
Sakshi News home page

పచ్చికబయళ్లలో.. ఆక్రమణల మేత!

Oct 2 2026 5:32 AM | Updated on Oct 2 2026 5:32 AM

పచ్చికబయళ్లలో.. ఆక్రమణల మేత!

తీర్పు కోసం వేచిచూస్తున్నాం

పచ్చికబయళ్ల భూములు ఆక్రమణలకు గురైన మాట వాస్తవమే. ఆక్రమణదారులకు ఇదివరకే ఆరుసార్లు నోటీసులు జారీ చేశాం. ఈలోగా వారు కోర్టుకు వెళ్లారు. న్యాయస్థానం తీర్పు వెలువడాక ఆ భూమిని స్వాధీనం చేసుకుని కంచెవేస్తాం.

– బి. శ్రీదేవి, తహసీల్దార్‌, పలాస

కాశీబుగ్గ : పశువులకు గ్రాసం అందించే పచ్చికబయళ్లు ఆక్రమణలు చెరలో చిక్కుకున్నాయి. ఈ స్థలం తమదేనని ఆక్రమణదారులు చెబుతుండగా.. ముమ్మాటికీ సర్కారుదేనంటూ రెవెన్యూ అధికారులు తేల్చిచెబుతున్నారు. భూమి చుట్టూ అధికారులు కంచె వేయకపోవడం వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చిందని స్థానికులు అంటున్నారు.

1.48 ఎకరాల కేటాయింపు..

పలాస మండలం కంబిరిగాం భూముల చెంత పారసంబ రెవెన్యూ పరిధిలో పశువులకు గ్రాసం లభించేందుకు వీలుగా సర్వే నంబరు 183, 2బీలో ప్రభుత్వం రెండెకరాల స్థలాన్ని గతంలో కేటాయించింది. ఈ స్థలాన్ని పచ్చిక బయళ్లుగా పిలుస్తారు. పారసంబ వెళ్లే రహదారికి ఆనుకొని ఈ భూమి ఉంది. గతంలో రెండెకరాలుండగా, జాతీయ రహదారి విస్తరణలో కొంత భాగం పోగా ప్రస్తుతం 1.48 ఎకరాలతో పచ్చిక బయళ్లుగా వదిలేశారు. కొందరు ఈ స్థలాన్ని ఆక్రమించి సాగు చేసుకుంటున్నారు. తమకు వారసత్వంగా వర్తించిందంటున్నారు. రెవెన్యూ అధికారులు మాత్రం ఇది ప్రభుత్వ స్థలమని స్పష్టం చేస్తున్నారు. దీంతో అటు రెవెన్యూ అధికారులు, ఇటు ఆక్రమణదారుల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది.

ఆధారాలేవీ..?

వివాదం చెలరేగిన నేపథ్యంలో ఆక్రమణదారులకు రెవెనూ అధికారులకు ఓ అవకాశమిచ్చారు. భూములు తమవేనంటూ ఆధారాలు చూపించాలని ఆదేశించారు. ఐదునెలల కిందట రెవెన్యూ అధికారులు ఈ స్థలం విషయమై రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. హక్కులకు సంబంధించి ధ్రువపత్రాలుంటే సమర్పించాలంటూ అందులో పేర్కొన్నారు. నెలన్నర వ్యవధిలో మరో రెండు నోటీసులు జారీ చేశారు. కానీ ఆక్రమణదారుల నుంచి స్పందన కరవైంది. పైగా తమను వేధిస్తున్నారంటూ ఆక్రమణదారుల్లో ఒకరు కోర్టును ఆశ్రయించడం గమనార్హం.

వర్తించని ప్రభుత్వ పథకాలు..

పచ్చిక బయళ్ల భూమి తనదేనంటూ సమర్థిస్తున్న వారి దగ్గర సరైన హక్కు పత్రాలు లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతులకు వర్తించే పథకాలు వర్తించడం లేదు. రెవెన్యూ విభాగంలో ఓ ఉద్యోగి ఆక్రమణదారులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఇదే భూమిని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నించారు. అప్పట్లో అధికారులు హడావిడి చేసి అడ్డుకున్నారు. కానీ ఇప్పుడు యథేచ్ఛగా భూమిని ఆక్రమిస్తుంటే మౌనం దాల్చడం ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తోంది.

కంచె ఏదీ?

ప్రభుత్వ భూముల రక్షణ విషయంలో రెవెన్యూ అధికారులు కొంతమేర ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారన్నది పచ్చిక బయళ్ల భూముల విషయంలో స్పష్టమవుతోంది. ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలుంటే గుర్తించి, వాటికి రక్షణ కంచె వేసి బోర్డును ఏర్పాటు చేయాలి. కానీ ఆ దిశగా సంబంధిత అధికారులు చొరవ చూపడం లేదు. దీంతో విలువైన ప్రభుత్వ భూముల్లో ఆక్రమణదారుల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది.

పారసంబ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ స్థలంపై కబ్జాదారుల కన్ను

భూమి తమదే అంటున్న ఆక్రమణదారులు

ముమ్మాటికీ సర్కారుదే అంటున్న రెవెన్యూ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement