పాఠశాలలకు మూడు రోజులు సెలవు
పర్లాకిమిడి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గజపతి జిల్లాలో కాశీనగర్, పర్లాకిమిడి, గుసాని, ఆర్.ఉదయగిరి సమితిలలో సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. గజపతి జిల్లాకు ఐ.ఎం.డీ. ఆరెంజ్ అలెర్టు చేయడంతో ప్రతి సమితి కేంద్రంలో ప్రజలను తుఫాన్‌పై అప్రమత్తం చేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో ఈ నెల 24 వరకూ సెలవు ప్రకటిస్తున్నట్టు డీఈఓ మయాధర్ సాహు తెలిపారు. గజపతి జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ కాశీనగర్ బ్లాక్‌లోని వంశధార నదీ ప్రాంతంలో వివిధ గ్రామాల్లో సందర్శించి ప్రజలను పరామర్శించారు. మోహనా బ్లాక్‌లో అత్యధికంగా 73.8 మి.మీ. వర్షం పడగా, కాశీనగర్‌లో 36, పర్లాకిమిడి 58 మి.మీ., రాయఘడలో 31.2, గుమ్మలో 35, నువాగడలో 48.2, ఆర్.ఉదయగిరిలో 52, గుసానిలో 49.0 మి.మీ.వర్షం కురిసింది.
మల్కన్‌గిరి : తుఫాన్ నేపథ్యంలో మల్కన్‌గిరి జిల్లాను ఆరెంజ్ జోన్‌గా ప్రకటించినందున అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ ఆదేశించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జిల్లాకు 25 వాడ్రాఫ్ బృందాలును కలిమెల సమితిలో, 12 బృందాలను మాత్తిలి సమితిలో సిద్ధం చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.
భువనేశ్వర్: ఖొర్ధా జిల్లాలో మూడు రోజుల పాటు అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ సహాయక, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు జిల్లా వ్యాప్తంగా కిండర్ గార్టెన్ (శిశు వాటిక) నుంచి 12వ తరగతి వరకు ఉన్న విద్యా సంస్థలకు వర్తిస్తాయన్నారు. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు పాఠశాలలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలు కూడా మూసివేయబడతాయన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్ అమృత్ రితురాజ్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం జరగాల్సిన ఎన్‌ఆర్టీఎస్ పరీక్ష ముందస్తు ప్రణాళిక ప్రకారం నిర్వహించారు. పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది తమ విద్యా సంస్థలలో యథాతథంగా హాజరు కావాలని ఆదేశించారు. విపత్తు నిర్వహణ నేపథ్యంలో పాఠశాల భవనాలు, సంబంధిత సౌకర్యాలను సిద్ధంగా ఉంచాలని పాఠశాలల అధికారులను కోరారు. పాఠశాల ప్రాంగణాలు 24 గంటలూ తెరిచి ఉండేలా రోస్టర్ డ్యూటీ విధానాన్ని అమలు చేయాలని ప్రధాన ఉపాధ్యాయులకు, ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.


