వాడీవేడిగా వర్షాకాల సమావేశాలు | - | Sakshi
Sakshi News home page

వాడీవేడిగా వర్షాకాల సమావేశాలు

Sep 23 2026 1:07 AM | Updated on Sep 23 2026 1:07 AM

వాడీవేడిగా వర్షాకాల సమావేశాలు

తొలి రోజు విరుచుకుపడిన విపక్షాలు

సభ నేటికి వాయిదా

భువనేశ్వర్‌: రాష్ట్ర శాసన సభ వర్షాకాల సమావేశాలు వందేమాతరం, జాతీయ గీతాలాపనతో ప్రారంభమయ్యాయి. ఎమ్‌ఎండీఆర్‌, పాఠ్య పుస్తకాలలోని తప్పులు అంశాలపై విపక్ష బిజూ జనతా దళ్‌, కాంగ్రెస్‌ సభ్యులు విరుచుకు పడడంతో సభలో వాతావరణం అకస్మాత్తుగా వేడెక్కింది. పలు మార్లు సభా కార్యక్రమాల్ని స్పీకరు వాయిదా వేశారు. ఈ సమావేశంలో 9 పనిదినాలు ఉండగా 6 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సభా కార్యకలాపాల మొదటి రోజున దివంగత సభ్యులకు సంతాప తీర్మానం ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు. ఏకగ్రీవ ఆమోదంతో దివంగత సభ్యులకు శ్రద్ధాంజలి సూచనగా కొద్ది నిమిషాలు సభలో వారంతా మౌనం పాటించారు. తొలి రోజు సమావేశాల్లో అటవీ, పర్యావరణ, పంచాయతీరాజ్‌ వంటి వివిధ శాఖలపై ప్రశ్నోత్తరాలకు కార్యక్రమం ఖరారు చేశారు. అనంతరం సమావేశాలు ఆరంభం కావడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని చుట్టుముట్టాయి. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైనప్పటి నుంచి గందరగోళం నెలకొంది. ఎంఎండీఆర్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. పాఠ్య పుస్తకాల్లో తప్పులపై బీజేడీ సభలో గందరగోళం సృష్టించింది. ప్లకార్డులు పట్టుకుని సభ మధ్యలోకి వచ్చి స్పీకరు పొడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు.

దివంగతులకు శ్రద్ధాంజలి..

దివంగత సభ్యులు, నేపాల్‌ వరదల్లో మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటించేందుకు ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. మాజీ మంత్రులు చంద్రశేఖర్‌ మాఝీ, సుశాంత్‌ సింగ్‌, మాజీ చీఫ్‌ విప్‌ సత్య భూషణ్‌ సాహు, మాజీ సభ్యులు రామమూర్తి గొమాంగో, హాజీ మహమ్మద్‌ అయూబ్‌ ఖాన్‌, శివాజీ మాఝీల మరణం పట్ల సభలో అఖిల పక్ష సభ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. నేపాల్‌ , భారత దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఇటీవల సంభవించిన వినాశకరమైన వరదలలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల సంతాపం తెలుపుతూ ముఖ్యమంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష నాయకుడు నవీన్‌ పట్నాయక్‌, కాంగ్రెస్‌ శాసనసభ పక్ష నాయకుడు రామచంద్ర కదమ్‌, వామపక్ష నాయకులు, స్పీకర్‌ సురమా పాఢి ఈ తీర్మానానికి మద్దతు తెలిపారు.

విపక్ష బీజేడీ సభ్యుల వాకౌటు..

స్పీకరు సభా కార్యక్రమాలు వాయిదా వేసినట్లు ప్రకటించడంతో బీజేడీ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు తరలివెళ్లారు. లోయర్‌ పీఎంజీ ప్రాంతంలో బైఠాయించి సభలో తమ డిమాండ్ల ప్లకార్డులతో ఆరు బయట ప్రదర్శన నిర్వహించారు.

నేటికి సభ వాయిదా..

ఎంఎండీఆర్‌ బిల్లు సవరణ, పాఠ్యపుస్తకాల్లో తప్పులపై ప్రతిపక్షాలు కొనసాగించిన నిరవధిక ఆందోళన కారణంగా స్పీకర్‌ సభను అంచెలంచెలు వాయిదా వేశారు. తొలుత మధ్యాహ్నం 1.10 గంటల వరకు తర్వాత సాయంత్రం 4 గంటల వరకు సభ వాయిదా పడింది. అప్పటికీ పరిస్థితి కుదుటపడక పోవడంతో సభా కార్యక్రమాలు బుధవారానికి వాయిదా పడినట్లు స్పీకరు సురమా పాఢి ప్రకటించడంతో తొలి రోజు వానా కాలం సమావేశాలకు తెర పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement