డిమోన్షియా లక్షణాలను తొలి దశలోనే గుర్తించాలి | - | Sakshi
Sakshi News home page

డిమోన్షియా లక్షణాలను తొలి దశలోనే గుర్తించాలి

Sep 23 2026 1:07 AM | Updated on Sep 23 2026 1:07 AM

రాయగడ : డిమోన్షియా లక్షణాలను తొలి దశలోనే గుర్తించి సకాలంలో వైద్యులను సంప్రదించడం ద్వారా మెరుగైన సంరక్షణకు అవకాశం ఉంటుందని సెంచూరియన్‌ యూనివర్శిటీ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ నర్సింగ్‌ విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రపంచ అల్జీమర్స్‌ డే సందర్భంగా స్థానిక ప్రధాన ఆస్పత్రిలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో స్కూల్‌ ఆఫ్‌ నర్శింగ్‌ 6వ సెమిస్టర్‌ బీఎస్సీ విద్యార్థులు పాల్గొన్నారు. డిమోన్షియాపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడం, వ్యాధి ప్రారంభ లక్షణాలను గుర్తించడం, అవసరమైన సమయంలో వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరని పేర్కొన్నారు.

భువనేశ్వర్‌ డీసీపీగా శరవణ వివేక్‌

భువనేశ్వర్‌: నలుగురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ హోం శాఖ మంగళవారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బరంపురం పోలీస్‌ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న డాక్టర్‌ ఎం.శరవణ వివేక్‌ను బదిలీ చేసి భువనేశ్వర్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌గా నియమించారు. ఈయన ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసిన జగ్‌మోహన్‌ మీనా నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. ఢెంకనాల్‌ జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న 2019 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అభినవ్‌ సోంకర్‌ బరంపురం పోలీస్‌ సూపరింటెండెంట్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో సహాయ పోలీస్‌ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న 2021 సంవత్సరం ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారి ఏబీ శిల్పను బర్‌గడ్‌ ఎస్డీపీఓగా నియమించారు. పారాదీప్‌ అదనపు పోలీస్‌ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న 2022 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి మానే అజింక్య బాబూరావును బదిలీ చేసి ఢెంకనాల్‌ జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌గా నియమించారు.

అక్టోబర్‌లో రాష్ట్రపతి

ముర్ము రాష్ట్ర పర్యటన

భువనేశ్వర్‌ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే నెలలో రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. అక్టోబర్‌ 27, 28 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నట్లు మయూర్‌భంజ్‌ లోక్‌సభ సభ్యుడు నొబొ చరణ్‌ మాఝీ తెలిపారు. 27న మయూర్‌భంజ్‌ జిల్లాలోని రాయిరంగ్‌పూర్‌లో జరిగే భారీ కంటి పరీక్షా శిబిరానికి హాజరవుతారని, 28న న్యూ ఢిల్లీకి తిరిగి వెళ్తారని పేర్కొన్నారు. అక్టోబర్‌ 26 నుంకి 30 వరకు జరిగే ఈ శిబిరంలో ఢిల్లీ నుంచి సుమారు 100 మంది అనుభవజ్ఞులైన నేత్ర వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచిత సేవలు అందిస్తారని తెలిపారు.

చిలికాలో పడవల

రాకపోకలు బంద్‌

భువనేశ్వర్‌: వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో చిలికా సరసులో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులతో పడవలు నడపడం శ్రేయస్కరం కాదని స్థానిక నావికులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పడవ ప్రయాణాలను నిలిపివేశారు. ప్రమాదకర పరిస్థితులకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన లేకున్నా చిలికాలో పెరుగుతున్న నీటి మట్టం, గాలుల తీవ్రత దృష్ట్యా పడవ నడిపేవారు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. నావికుల స్వీయ నిర్ణయం ప్రకారం చిలికా సరస్సులోని సత్తొపొడా, జొహ్నికుద మధ్య నావిక సేవలు సోమవారం నుంచి ఈ నెల 25 వరకు నాలుగు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

నేడు సర్వ దర్శనం

తాత్కాలికంగా నిలిపివేత

భువనేశ్వర్‌: పూరీ శ్రీమందిరంలో బుధవారం భక్తులకు సర్వ దర్శనం తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు అధికార వర్గాలు మంగళవారం ప్రకటించాయి. ఈ నెల 23న భాద్రపద శుక్ల పక్ష ద్వాదశి తిథి పురస్కరించుకుని శ్రీమందిరంలో వామన జయంతి ఉత్సవ సన్నాహాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్న ధూపం సమర్పించిన తర్వాత వామన జయంతి సన్నాహాలు చేపడతారు. ఈ క్రమంలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు సర్వ దర్శనం నిలిపివేయబడుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement