జయపురం: జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతినుద్దేశించి రాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కొరాపుట్ ఇటీవల జరిగిన దిశా సమావేశంలో ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతితో జరిగిన వాగ్వాదం, అనంతరం జరిగిన రాజకీయ వివాదంపై కాంగ్రెస్ నాయకులు శాసన సభ్యుడుకి అండగా నిలిచారు. స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు రూపక్ తురుక్ అధ్యక్షతన మంగళవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించి రాజకీయ వర్గాల విమర్శలను ఖండించారు. ఆనాడు జరిగిన వివాదంపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆనాటి సంఘటనపై ఎమ్మెల్యే బాహిణీపతి క్షమాపణ చెప్పాలని మంత్రి చేసిన డిమాండ్‌ను కాంగ్రెస్ నేతలు తోసి పుచ్చారు. తమ నేత తారాప్రసాద్ బాహిణీపతి క్షమాపణ చెప్పాలన్న మంత్రి డిమాండ్‌ను తాము అంగీకరించమని స్పష్టం చేశారు. విపక్షాల దాడి జయపురం ఎమ్మెల్యే గౌరవానికి భంగం కలిగిందన్నారు. డీసీసీ అధ్యక్షుడు రూపక్ తురుక్ మాట్లాడుతూ.. పాత్రికేయులు, మీడియా ప్రతినిధులంటే ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతికి ఎంతో గౌరవం, అభిమానం ఉందన్నారు. ఎమ్మెల్యేను ఏదైనా అడగాలని ఉంటే సమావేశం హాల్ లోపలే అడగాల్సిందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. కొంతమంది రాజకీయ నేతలు జిల్లాలో ఉన్న అనేక సమస్యలను పట్టించుకోకుండా నిజాయితీ పరుడు, ప్రజా సేవకులైన ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతిపై అబాండాలు వేస్తూ అతన్ని కించపరుస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో ప్రజలు అనేక సమస్యలపై సతమత మౌతున్నారని వారి సమస్యలను తీర్చే బాధ్యత అన్ని రాజకీయ పార్టీలదన్నారు. సమస్యలు పరిష్కారం విషయంలో మీడియా ప్రతినిధులు కాంగ్రెస్ శ్రేణులకు అండగా నిలవాలని డీసీసీ అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు. సమావేశఃలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కోశాధికారి నిహార్ బిశాయి, మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి, మల్కనగిరి మాజీ ఎమ్మెల్యే నియిచరణ సర్కార్, సీనియర్ కాంగ్రెస్ నేత బినోద్ మహాపాత్రో, కౌన్సిలర్ ప్రణబ కుమార్ నాయిక్ ఉన్నారు.


