భువనేశ్వర్: స్థానిక బిజూ పట్నాయక్ రాష్ట్ర పోలీస్ అకాడమీలో శుక్రవారం 13వ బ్యాచ్ క్యాడెట్ సబ్ ఇన్‌స్పెక్టర్ల స్నాతకోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ మాట్లాడుతూ రెండేళ్ల కఠినమైన ఇండోర్, అవుట్‌డోర్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన 336 మంది కొత్త క్యాడెట్ సబ్ ఇన్‌స్పెక్టర్లలో 70 మంది మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్లు ఉండడం రాష్ట్రంలో బలపడుతున్న మహిళా సాధికారత, సామాజిక స్వరూపానికి ఒక ప్రకాశవంతమైన ప్రతిబింబంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా 2029 నాటికి ఒడిశాను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక నేరాలు, సైబర్ మోసాలను ఎదుర్కోవడానికి ఒడిశా పోలీసులు నిరంతరం తమను తాము నవీకరించుకోవాలని ప్రోత్సహించారు. రాష్ట్రంలో మావోయిస్టు, నక్సల్ హింసను పూర్తిగా అణచివేయడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. గత రెండేళ్లలో పోలీసు శాఖలో 17,794 కొత్త పోస్టులను సృష్టించి 5,817 పోస్టులను భర్తీ చేశారు. పోలీస్ ఠాణాల సామర్థ్యం పెంపుదలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం కల్పిస్తుందన్నారు. పోలీసు బలగాన్ని మరింత సమర్థంగా మార్చేందుకు ‘స్మార్ట్ పోలీసింగ్’ విధానాన్ని అవలంబించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో వివిధ విభాగాల్లో రాణించిన క్యాడెట్లను ముఖ్యమంత్రి సత్కరించారు. ఇందులో అత్యధిక మార్కులు సాధించిన పి.నళిని రావుకు ముఖ్యమంత్రి గవర్నర్ పతకం, ట్రోఫీ, రూ.10,000 నగదు బహుమతిని అందజేశారు. పోలీస్ శిక్షణలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన తేజస్విని మహంత్రాయ్, యుధిష్టర్ బెహరా, లక్ష్మణ్ కుమార్ మహంతో, సస్మిత ఖుంటియా, నిహారిక త్రిపాఠి, అశుతోష్ నాయక్‌లకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ట్రోఫీలు అందజేశారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ వినయతోష్ మిశ్రా, బిజూ పట్నాయక్ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనూప్ కుమార్ సాహు, రాష్ట్ర సీనియర్ పోలీస్ అధికారులు, ఇండోర్, అవుట్‌డోర్ శిక్షకులు, కొత్తగా నియమితులైన క్యాడెట్ల సంరక్షకులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.


