జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితిలో ఎక్స్–కేడర్ ఉపాధ్యాయుల డిమాండ్ల సాధన కోసం సోమవారం ధర్మా చేపట్టనున్నట్లు విద్యాధికారులను ఆ సంఘం సభ్యులు హెచ్చరించారు. ఈ మేరకు ఆ సంఘ నేతలు బొయిపరిగుడ బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారికి నోటీసు ఇచ్చారు. గత రెండు నెలలుగా ఎక్స్–కేడర్ ఉపాధ్యాయులకు జీతాలు అందటంలేదని వారు ఆరోపించారు. సెప్టెంబర్ 5వ తేదీన తమకు జీతాలు రాలేదని బీడీఓను కలిసి తెలిపామని, అయినా నేటివరకు రెండు నెలల జీతాలు చెల్లించలేదని వారు విమర్శించారు. మరోసారి మొమోరాండం బీఈఓకు సమర్పించి వెంటనే బకాయి జీతాలు చెల్లించాలని, లేనిచో బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి కార్యాలయం ముందు ధార్నా చేస్తామని నోటీసులో హెచ్చరించామన్నారు. అధికారుల్లో స్పందన లేదని, అందువల్ల సోమవారం ఆందోళన చేపడుతున్నట్లు సంఘ నేతలు వెల్లడించారు. ప్రతినెలా మొదటి వారంలోనే జీతాలు చెల్లించాలని, బకాయి జీతాలు వెంటనే ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. బకాయి డీఏను వెంటనే చెల్లించాలని, కొంతమంది ఉపాధ్యాయులకు పెరిగిన జీతాలు చెల్లించాలని మెమోరాండంలో డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఒడిశా విద్యాలయ, గణ శిక్షా విభాగ ఉత్తర్వుల ప్రకారం ఎక్స్–కేడర్ ఉపాధ్యాయులను ప్రభుత్వ ఉద్యోగులుగా గురింపునిచ్చి ప్రమోషన్‌లు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న అన్ని సౌకర్యాలు కల్పించాలని, దసరాను దృష్టిలో పెట్టుకొని అడ్వాన్స్ జీతాలు ఇవ్వాలని, ఇళ్లు నిర్మించుకొనేందుకు ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నట్లు తెలిపారు. వెంటనే తమ డిమాండ్లు అమలు చేయకపోతే ఈ నెల 21వ తేదీ నుంచి ధార్నా నిర్వహిస్తామని అధికారులను హెచ్చరించామని, అధికారులు తమ డిమాండ్ పట్ల నిమ్మకు నీరెట్టినట్లు వ్యవహరిస్తున్నారని, అందుచేత తప్పనిసరి పరిస్థితిలో ధర్నా చేపడుతున్నట్లు వెల్లడించారు.


