జయపురం: తప్పించుకు తిరగుతున్న అంతర్ ర్రాష్ట్ర దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ పోలీసులు అంతర్ రాష్ట్ర దొంగ సునా హరిజన్‌ను అరెస్టు చేశారు. నవరంగపూర్, కొరాపుట్, కలహండి జిల్లాలతోపాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఈయనపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు ఉన్నాయి. అతన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే బొరిగుమ్మ పోలీసులు ఎట్టకేలకు పట్టుకోగలిగారు. అరెస్టు చేసిన పోలీసులు అతడి వద్ద ఒక తుపాకీతో పాటు ఎక్కువ తూటాలు స్వాధీన పరచుకున్నట్లు పోలీసు అధికారులు శుక్రవారం వెల్లడించారు. నిందితుడు నవరంగపూర్ జిల్లా కుసిమి గ్రామ వాసి. అతనిపై కలహండి, కోరాపుట్, నవరంగపూర్ జిల్లాల్లో, ఛత్తీస్‌గఢ్‌లో 30కి పైగా కేసులున్నాయి. గతంలో బొరిగుమ్మ పోలీసు స్టేషన్ పరిధిలో పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ధ్వంసం చేయడం, పోలీసులను హత్య చేసేందుకు ప్రయత్నించటం, వివిధ మారణాయుధాలతో దాడి జరపటం మొదలగు కేసులలో నిందితుడు. అతడిని పట్టుకొనేందుకు జిల్లా ఎస్పీ రోహిత్ వర్య నేతృత్వంలో జిల్లాలో ఇద్దరు అదనపు ఎస్పీలు బొరిగుమ్మ ఎస్‌డీపీఓ, బొరిగుమ్మ పోలీసు అధికారి, జిల్లాలో కొంతమంది పోలీసులతో స్వతంత్ర టీమ్ ఏర్పాటు చేశారు. అతడిని పట్టుకొనేందుకు ఆ టీమ్ పక్క రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా జగదల్‌పూర్ పరిసర ప్రాంతాలలో దాడులు నిర్వహించారు. ఆ దాడులలో నిందితుడుని అతికష్టంపై పట్టుకొని అరెస్టు చేసి బొరిబుమ్మ స్టేషన్‌కు తీసుకు వచ్చి తమదైన పద్ధతిలో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ దాడులలో కొరాపుట్ అదనపు ఎస్పీలు మనోజ్ పూజారి, అభిషేక్ పాణిగ్రహి, బొరిగుమ్మ పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్ సిద్ధార్థ బెహర, కానిస్టేబుళ్లు అజయ ఖొర,సోను పంగిలు పాల్గొన్నారు. నిందితుడు సునా హరిజన్ ను ఛత్తీస్‌గఢ్‌లోని పోలీసుల సహకారంతో అరెస్టు చేసినట్లు బొరిగుమ్మ పోలీసులు వెల్లడించారు.


