భారత ఉపరాష్ట్రపతితో రాష్ట్ర గవర్నర్‌ భేటీ | - | Sakshi
Sakshi News home page

భారత ఉపరాష్ట్రపతితో రాష్ట్ర గవర్నర్‌ భేటీ

Sep 5 2026 7:01 AM | Updated on Sep 5 2026 7:01 AM

భువనేశ్వర్‌: రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు కంభంపాటి న్యూ ఢిల్లీ పర్యటనలో భాగంగా భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధా కృష్ణన్‌ను కలిశారు. ఈ మర్యాదపూర్వక భేటీలో ఒడిశా అభివృద్ధి, పాలన, సామాజిక, ఆర్థిక సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై ఉప రాష్ట్రపతితో చర్చించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అమలు వేగవంతం చేసే దిశలో అభివృద్ధి ప్రాధాన్యత, సంక్షేమ పథకాల కార్యక్రమాలపై వీరివురు చర్చించారు. ఒడిశాలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థమైన అమలు, వాటి ప్రయోజనాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అందేలా చూడాల్సిన ఆవశ్యకతపై ఈ ఇరువురు ప్రముఖులు చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది. డాక్టర్‌ కంభంపాటి న్యూ ఢిల్లీ పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో ఆయన పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖులను కూడా కలవనున్నారు.

కొండచిలువ హల్‌చల్‌

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సమితి పరజాగూడ గ్రామంలో శుక్రవారం ఉదయం ఓ ఇంట్లో ఆరు అడుగుల కొండ చిలువల్‌ హల్‌చల్‌ చేసింది. కోళ్లను తిని ఓచోట ఉన్న కొండచిలువను ఇంటి యజమాని గుర్తించి అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అటవీశాఖ వారు వెంటనే స్నేక్‌ హెల్ప్‌లైన్‌ సత్యజిత్‌ గౌడ్‌కు సమా చారం ఇవ్వడంతో అటవీశాఖ ఉద్యోగి డాంబురు సహాయంతో పామును అతికష్టపై పట్టు కున్నారు. కొండచిలువ మూడు కోళ్లను తినేసింది. వైద్య పరీక్షలు నిర్వహించి తిరిగి అటవీ ప్రాంతంలో విడిచి పెడతామని అధికారులు వెల్లడించారు. వన్యప్రాణులను చూసి బయపడకుండా ఉండడంతోపాటు వాటికి హాని తలపెట్టకుండా అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని స్నేక్‌హెల్ప్‌లైన్‌ సత్యజిత్‌ కోరారు.

హై టెక్‌లో అరుదైన శస్త్ర చికిత్స

భువనేశ్వర్‌: ఆరోగ్య సంరక్షణ రంగంలో హై టెక్‌ వైద్య బోధన ఆస్పత్రి మరో మైలు రాయిని నెలకొల్పింది. కటక్‌కు చెందిన రోగికి అరుదైన శస్త్ర చికిత్స చేసి కోలుకునేలా చేసింది. భువనేశ్వర్‌, కటక్‌ ప్రాంతాల్లో పలు ప్రముఖ వైద్య సంస్థలు అతడికి నమ్మకమైన చికిత్స పొందేందుకు ఢిల్లీ ఎయిమ్స్‌కు తీసుకువెళ్లమని సలహా ఇచ్చి చేతులెత్తేశాయి. ఈ పరిస్థితుల్లో హై టెక్‌ ఆస్పత్రికి చెందిన సీనియర్‌ వైద్యుల బృందం గట్టి భరోసా ఇచ్చి సంక్లిష్టమైన గుండె శస్త్ర చికిత్సకు నడుం బిగించింది. సంకల్పం మేరకు శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో దీర్ఘ కాలిక పీడితుడు పూర్తి ఆరోగ్యంతో కోలుకుని బంధువులతో కలిసి ఇంటికి వెళ్లాడు. కటక్‌కు చెందిన ఈశ్వర్‌ రౌత్‌ చాలా కాలంగా తీవ్రమైన అనారోగ్యంతో సతమతం అయ్యాడు. నడక, శ్వాస తీసుకోవడంలో నిరవధికంగా పడుతున్న బాధ నుంచి విముక్తి కోసం పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులకు సందర్శించిన తగిన వైద్యం, చికిత్స అక్కరకు రాలేదు. గుండెకు అనుసంధానం చేసే రక్త నాళం చిట్లి పోవడంతో ఏ ఆస్పత్రి కూడా రోగికి అవసరమైన శస్త్ర చికిత్స చేయడానికి అంగీకరించలేదని ఈశ్వర్‌ రౌత్‌ భార్య తెలిపింది. క్రమంగా ఈశ్వర్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హై టెక్‌ వైద్య బోధన ఆస్పత్రిలో చేర్చారు. సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శ్వేతంకర దాస్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో డాక్టర్‌ బెరియన్‌ స్వైన్‌ శస్త్ర చికిత్స బృందం రోగికి విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించారు. కొద్ది రోజుల్లోనే రోగి పూర్తిగా కోలుకుని ఇంటికి తిరిగి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement