ఆగని శిశు మరణాలు | - | Sakshi
Sakshi News home page

ఆగని శిశు మరణాలు

Sep 5 2026 7:01 AM | Updated on Sep 5 2026 7:01 AM

రాయగడ జిల్లాలో

నాలుగేళ్లలో 2,765 మంది మృతి

మూడు నెలల్లోనే 177 మంది చిన్నారుల మృతి

రాయగడ: మాతా, శిశు సంరక్షణకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ జిల్లాలో శిశు మరణాల పరంపర ఆగడం లేదు. గడిచిన నాలుగేళ్లలో జిల్లాలో ఏకంగా 2,765 మంది శిశువులు మృతి చెందగా, కేవలం గత మూడు నెలల్లోనే 0–1 సంవత్సరం వయసున్న 177 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిణామం జిల్లాలో మాతా, శిశు ఆరొగ్యం, పోషకాహారం, వైద్య సేవల పరిస్థితిపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆదివాసీ ప్రాబల్యం గల ఈ జిల్లాలో మహిళలు, చిన్నారుల్లో పొషకాహర లోపం, రక్తహీనత చాలాకాలంగా ప్రధాన సమస్యలుగా కొనసాగుతున్నాయి. వీటిని అధిగమించేందుకు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడంతో పాటు, ముఖ్యమంత్రి సంపూర్ణ పుష్టి యోజన కింద నెలకు 12 గుడ్లు, పుట్టగొడుగు, శనగలు, ఐరన్‌ పెంపునకు బాదం లడ్డు, ఖర్జూరం వంటి ఆహార పదార్థాలను అందిస్తోంది. అలాగే మమత పథకం ద్వార ఆర్థిక సాయం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, ఆస్పత్రిలో ప్రసవాలను ప్రోత్సహించడం వంటి చర్యలు చేపడుతోంది. ఇన్ని పథకాలు, చర్యలు ఉన్నప్పటికీ శిశు మరణాలను నియంత్రించలేకపోవడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. పొషకాహార లోపం, రక్తహీనత, న్యూమోనియా, ఇతర ఆరోగ్య సమస్యలతో పాటు కొన్ని చోట్ల గర్భస్థ దశలోనే, మరొకొన్ని సందర్భాల్లో ప్రసవం అనంతరం నవజాత శిశువులు మృత్యువాత పడుతున్నట్లు తెలుస్తోంది.

కొనారలో అత్యధిక మరణాలు

గత మూడు నెలల గణాంకాలను పరిశీలిస్తే జిల్లాలోని కొలనార సమితిలో అత్యధికంగా 29 మంది శిశువులు మృతి చెందారు. అలాగే కాశీపూర్‌, బిసంకటక్‌లలో చెరో 21 మంది కళ్యాణసింగుపూర్‌లో 25 , రాయగడలో 23, మునిగుడలో 16, గుణుపూర్‌లో 13, రామనగుడలో 10, చంద్రపూర్‌లో 7, గుడారిలో 6, పద్మపూర్‌లో 4 గురు శిశువులు మృతి చెందారు. పట్టణ ప్రాంతంలోనూ ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

నాలుగేళ్ల గణాంకాలు మరింత ఆందోళనకరం

2022–23 లో 19,475 మంది శిశువులు జన్మిస్తే ఇందులో 675 మంది మరణించారు. అదేవిధంగా 2024–25 లో 18,793 మంది శిశువులు జన్మిస్తే 674 మంది శిశువులు మృతి చెందారు. 2025–26 లో 15,976 మంది జన్మిస్తే 755 మంది మృతి చెందారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే జననాల సంఖ్య తగ్గుతున్నప్పటికీ శిశు మరణాల సంఖ్య తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా 2025–26 లో 15,976 మంది శిశువులు జన్మించగా 755 మంది మృతి చెందడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. ప్రభుత్వం తరచూ ఉన్నత స్థాయి సమీక్షలను నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆశించిన మార్పు కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement