అంగరంగ వైభవంగా
రాధాకృష్ణ వేషధారణలో చిన్నారులు
రాయగడ: స్థానిక డైలీ మార్కెట్‌లోని శ్రీ కృష్ణ ధ్యాన మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. విశ్వ కల్యాణ సాధన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జన్మాష్టమి సందర్భంగా ముందుగా శ్రీకృష్ణ స్వామివారి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి భక్తుల నామస్మరణల మధ్య ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అనంతరం శ్రీకృష్ణ ధ్యానమందిరంలో ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
పర్లాకిమిడిలో..
పర్లాకిమిడి: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు స్థానిక శ్రీసరస్వతీ శిశు విద్యామందిర్‌లో ఘనంగా జరుపుకున్నారు. విద్యాలయంలో రెండు నుంచి ఐదో తరగతి విద్యార్థులు శ్రీకృష్ణుని వేషధారణ పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యాలయం కమిటీ పర్యవేక్షకులు సంజయ్ జెన్నా, ముఖ్యఅతిథిగా ఉపకారాగారం సూపరింటెండెంట్ కామాక్షి ప్రసాద్ పాఢి, మహాంత రామానంద దాస్, కోశాధికారి ప్రమోద్‌చంద్ర పాఢి, సరితా పాణిగ్రాహి, సుజాతా గోమాంగో ప్రముఖులు పాల్గొన్నారు.
జయపురంలో..
జయపురం: జయపురంలో వివిధ ఆధ్యాత్మిక సంస్థలు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తితో ఘనంగా జరుపుకున్నాయి. సరస్వతీ శిశుమందిర్ గీతా భవనం, రాధాకృష్ణ ఆలయం, రఘునాథ్ మందిరం తదితర ప్రాంతాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి పూజలు జరిపారు. గీతా భవనంలో శ్రీకృష్ణ వేషాల పోటీలు నిర్వహించారు. ఆ పోటీలలో అనేక మంది చిన్నారులు పాల్గొన్నారు.


