భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభ సమావేశాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం అవుతాయని శాసన సభ సచివాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమావేశాలు అక్టోబర్ 3 వరకు నిరవధికంగా కొనసాగుతాయి. ఇందులో 1 ప్రైవేట్, 8 ప్రభుత్వ పని దినాలతో కలిపి మొత్తం 9 పని దినాలు ఉంటాయని ఉత్తర్వులు పేర్కొన్నాయి. ప్రభుత్వ సెలవుల కారణంగా సెప్టెంబర్ 26, 27 తేదీల్లో సభా కార్యకలాపాలు నిలిచిపోతాయి. అదే విధంగా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న కూడా సభా కార్యకలాపాలు కొనసాగవని ప్రకటించారు.
రోడ్డు పక్కనే చెత్త కుప్పలు
పర్లాకిమిడి: గజపతి జిల్లా కాశీనగర్ ఎన్.ఎ.సి.లో ఇరవై రోజులుగా రోడ్డు పక్కనే చెత్త డంపింగ్ చేయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కాశీనగర్ ఎన్.ఎ.సికి అర్బన్ శాఖ ఇచ్చిన నిధులున్నాయి.. కానీ సిబ్బందిని నియమించకుండా అధికారులు కాలక్షేపం చేస్తున్నారు. ఎప్పుడో 10 రోజులకు గానీ చెత్త తీయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన కుక్కలు, ఇతర జుంతువుల కళేబరాలు కూడా రోడ్డు పక్కనే వేస్తున్నారు. పేరుకుపోయిన చెత్తను తీయకపోవడంతో దుర్గంధం వ్యాపిస్తుంది. చెత్తను ఎత్తివేసి పరిశుభ్రంగా ఉంచాలని ఎన్.ఎ.సి చైర్మన్ ఎం.సుధారాణికి స్థానికులు వినతిపత్రం అందజేశారు.
ప్రభుత్వ సేవల పరిశీలన
మల్కన్‌గిరి : కలెక్టర్ ప్రథమేశ్ అర్వింద్ రాజశిర్కే గురువారం జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలను వార్షిక తనిఖీలో భాగంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మల్కన్‌గిరి సమితి పరిధిలో వీరలక్ష్మణ్‌పూర్ పంచాయతీ కార్యాలయం, పాంగం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం మత్తిలి పోలీసుస్టేషన్‌ను సందర్శించారు. అక్కడ పరిపాలనా విధానం రికార్డులు, పత్రాలను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాల పనితీరును మెరుగు పరచడం, ప్రభుత్వ సేవలు ఎలాంటి జాప్యం లేకుండా సాధారణ ప్రజలకు చేరేలా చూడటం తన పర్యటన ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు.
దుకాణాల్లోకి దూసుకొచ్చిన కంటైనర్
బూర్జ: పాలకొండ ప్రధాన రహదారిలో తుడ్డలి గ్రామ కూడలి వద్ద బుధవారం అర్ధరాత్రి దాటాక కంటైనర్ బీభత్సం సృష్టించింది. పాలకొండ వైపు నుంచి శ్రీకాకుళం వైపు వస్తూ తుడ్డలి గ్రామ పరిధిలోని ట్రాన్సఫార్మర్‌ను ఢీకొట్టింది. పక్కనే ఉన్న దుకాణాలు, ఇళ్లవైపు దూసుకెళ్లింది. రాత్రిపూట ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బాధిత షాపుల యజమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం.ప్రవళ్లిక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భర్తకు తలకొరివి పెట్టిన భార్య
సారవకోట : మండల కేంద్రం సారవకోటలో గార సంతోష్ మృతి చెందగా దివ్యాంగురాలైన భార్య సంతోషి ఆయన చితికి తలకొరివి పెట్టింది. సంతోష్ మూడు రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందాడు. గురువారం సారవకోటలో అంత్యక్రియలు నిర్వహించగా దివ్యాంగురాలైన భార్య సంతోషి ఇతర మహిళల సహాయంతో ఆయన చితికి తలకొరివి పెట్టింది. నిరుపేద కుటుంబమైన వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద దిక్కు దూరం కావడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
రైలు ఢీకొని ఆవు మృతి
టెక్కలి రూరల్: స్థానిక తెంబూర్ రోడ్డులోని రైల్వే ట్రాక్‌పై రైలు ఢీకొని ఆవు మృతిచెందింది. గురువారం సాయంత్రం గుణ్‌పూర్ నుంచి నౌపడ వెళ్తున్న రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆవుకి సంబంధించిన వారు ఎవరూ రాకపోవడంతో రహదారి పక్కగా పడేయడంతో దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు చెబుతున్నారు.


