రాయగడ: మృతి చెందిన జర్నలిస్టు రాజీవ్ లోచన్ పండ తల్లిదండ్రులకు రాయగడ ప్రెస్ యూనియన్ మరోసారి ఆర్థిక సాయం అందజేసింది. యూనియన్ అధ్యక్షుడు ఇప్పిలి సర్వేశ్వరరావు నేతృత్వంలో గుముడా ఖిలింగరాయిలోని వారి నివాసానికి వెళ్లి నెలకు రూ.1,000లు చొప్పున 11 నెలలకు సంబంధించిన రూ.11 వేల భత్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి శివాజీ దాస్ మాట్లాడుతూ యూనియన్ ఒక కుటుంబం, సభ్యులు కష్టాల్లో ఉన్నప్పుడు సంఘం అండగా నిలస్తుందన్నారు. ప్రతీ సభ్యుడి కుటుంబానికి రక్షణగా నిలవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. జర్నలిస్టుల కుటుంబాల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలని సంఘం సలహాదారుడు సురేష్ దాస్ కోరారు.
ఘనంగా పోషకాహార దినోత్సవం
పర్లాకిమిడి: సమతుల్యమైన పోషక విలువలు కలిగిన ఆహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడమే పోషకాహార దినోత్సవం ముఖ్య ఉద్దేశమని నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్.ఎన్.సంధ్య అన్నారు. ఆర్.సీతాపురంలో సెంచూరియన్ వర్సిటీ ఆధ్వర్యంలో గుసాని బ్లాక్ రణదేవి గ్రామంలో పోషకాహార దినోత్సవం 2026ను విద్యార్థులు, ఫ్యాకల్టీ నిర్వహించారు. సరైన పోషకాహారంపై నర్సింగ్ విద్యార్థులు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. పోషకాహారం శరీరం ఎదుగుదల, రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఎంతగానో సహాయపడుతుందని వివరించారు. పోస్టర్ ప్రదర్శించి సమతుల్య ఆహారం వల్ల పిల్లల ఎదుగుదలను వివరించారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీ కో–ఆర్డినేటర్లు, సునీత, మధుచందా తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సేవా సంకల్ప్ అభియాన్
మల్కన్‌గిరి: పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో 25 ఏళ్ల సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా బీజేపీ నేతలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవకు అంకితమైన 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలు చేపట్టారు. మహిళల గౌరవం కోసం నరేంద్ర మోదీ చేసిన ప్రతీ పథకం కూడా ప్రజలకు అందేవిధంగా చూడాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు అశోక్ పారిడా వెల్లడించారు. కార్యక్రమంలో మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మాడ్కమి, కుశ్ తాతి, శాంతిలత మాఝి, ప్రత్యేక అభివృద్ధి మండలి చైర్మన్ గంగా సోడి, మాజీ ఎమ్మెల్యే డంబరు సీసా, జిల్లా కార్యదర్శి మాణిక్ లాల్ చక్రవర్తి, నవఘన్ లోకేయి తదితరులు పాల్గొన్నారు.
సోఫియా ఫిర్దౌస్
రాజీనామా చేయాలి
భువనేశ్వర్: వచ్చే శాసనసభ ఎన్నికల్లో మరో రాజకీయ పార్టీ తరఫున పోటీ చేయాలని భావిస్తే బారాబటి కటక్ శాసనసభ నియోజక వర్గం సిటింగ్ ఎమ్మెల్యే సోఫియా ఫిర్దౌస్ పార్టీకి రాజీనామా చేయాలని ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఓపీసీసీ) కోరింది. 2024లో ఆమె కాంగ్రెస్ టికెట్‌పై రాష్ట్ర శాసన సభకు ఎన్నికై న విషయం తెలిసిందే. కాబట్టి మరో రాజకీయ పార్టీ నుంచి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించే ముందే పార్టీని వీడాలి అని ఓపీసీసీ చీఫ్ తెలిపారు. తన కుమార్తె ఫిర్దౌస్ బారాబటి కటక్ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై తిరిగి పోటీ చేయదు. 2029 ఎన్నికలలో కొత్తగా ఏర్పడిన ఒడిశా జనతా కాంగ్రెస్ (ఓజేసీ) అభ్యర్థిగా పోటీ చేస్తుందని మాజీ శాసన సభ్యుడు మహ్మద్ మోకిమ్ ప్రకటించిన మర్నాడు భక్త చరణ్ దాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో సోఫియా ఫిర్దౌస్ తన సమీప బీజేపీ ప్రత్యర్థి పూర్ణచంద్ర మహాపాత్రోను సుమారు 8,000 ఓట్ల తేడాతో ఓడించి ప్రతిష్టాత్మకమైన బారాబటి కటక్ శాసన సభ స్థానాన్ని గెలుచుకున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 16న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆమెతో పాటు మరో 2 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేష్ జెనా, దాశరథి గోమాంగోలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.


