రాయగడ: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ యువతి నుంచి రూ.లక్ష తీసుకుని మోసం చేశారని స్థానిక వెబ్ ఛానల్ జర్నలిస్ట్ అనుబ్రత బరాపై సదరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. తెరువలి ప్రాంతానికి చెందిన యువతి జుబంతి హికక పట్టణంలోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి సదరు జర్నలిస్టు తన వద్ద నుంచి రూ.లక్ష తీసుకున్నారని ఆరోపించారు. గత ఆరు నెలలుగా ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మిస్తూ వచ్చారని, అనంతరం రూ.లక్షకు సంబంధించిన చెక్ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఆ చెక్‌ను బ్యాంకులో జమ చేయగా బౌన్స్ అయినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ జుబంతీ తన బంధువుతో కలసి మంగళవారం సదరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన నుంచి తీసుకున్న డబ్బును తిరిగి ఇప్పించడంతో జర్నలిస్టుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. కాగా ఈ విషయంపై పోలీసుల అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు.


