భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే కొత్త అదనపు జనరల్ మేనేజర్ (ఏజీఎం)గా బిజయ్ కుమార్ మిశ్రా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ (ఐఆర్‌ఏఎస్) 1991 బ్యాచ్ అధికారి. రైల్వే ఆర్థిక, పథకాల నిర్వహణ, రైలు కార్యకలాపాల రంగంలో సుదీర్ఘంగా 35 సంవత్సరాలకు పైబడిన విభిన్నమైన అనుభవాన్ని కలిగి ఉన్నారు. భారతీయ రైల్వేలో తన విశిష్టమైన కెరీర్‌లో ఆయన అనేక ముఖ్యమైన సవాళ్లతో కూడిన బాధ్యతలను నిర్వహించారు. తన ప్రస్తుత బాధ్యతతో పాటు బిజయ్ కుమార్ తూర్పు కోస్తా రైల్వేలో ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ (పీఎఫ్‌ఏ)గా కూడా పని చేస్తున్నారు. అక్కడ ఆయన అకౌంట్స్, ఫైనాన్స్, బడ్జెటింగ్, ఇంటర్నల్ ఆడిటింగ్ వంటి కీలకమైన విధులకు బాధ్యత వహిస్తున్నారు. గతంలో ఈశాన్య సరిహద్దు రైల్వేలోని తిన్‌సుకియా మండలంలో మండల రైల్వే అధికారి (డీఆర్‌ఎం)గా పని చేశారు. మలేషియాలోని కౌలలాంపూర్‌లో ఉన్న ఐఆర్‌కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో డిప్యుటేషన్‌పై ప్రాజెక్ట్ ఫైనాన్స్ హెడ్‌గా చేరి ప్రధాన అంతర్జాతీయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పర్యవేక్షించారు. విద్యాపరంగా బిజయ్ కుమార్ మిశ్రా ధన్‌బాద్ ఐఐటీ నుంచి అప్లయిడ్ జియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ లీ క్వాన్ యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ నుంచి మాస్టర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ (ఎంపీపీ) పట్టాను పొందారు. ఆయన లండన్ మరియు ప్యారిస్‌లోని యూరోపియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌లో, చైనాలోని బీజింగ్ జియావోటాంగ్ యూనివర్సిటీలో హెవీ హాల్ రైల్వే టెక్నాలజీలో ఉన్నత వృత్తిపరమైన శిక్షణను పొందారు.
ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి
● నిందితులకు రెండేళ్ల జైలుశిక్ష
రాయగడ: విధుల్లో ఉన్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై అమానుషంగా దాడి చేసిన ఘటనపై జిల్లా కోర్టు ఇద్దరు నిందితులకు రెండేళ్ల పాటు జైలు శిక్షను విధించడంతో పాటు ఒకొక్కరూ రూ.2 వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ జరిమానా కట్టకుంటే అదనంగా మరో రెండేసి నెలలు జైలు శిక్ష అనుభవించాలని తమ తీర్పులో పేర్కొంది. రాయగడ సివిల్ జడ్డి (సీనియర్ డివిజన్), అదనపు సెషన్ జడ్డి ఆశీష్ పట్నాయక్ ఈ తీర్పును వెలువరించారు. వివరాల్లోకి వెళ్తే.. 2023 నవంబర్ 17వ తేదీన బాధితుడు ప్రణవ్ కుమార్ పాఢి ట్రాఫిక్ విధుల్లో ఉండగా అదే సమయంలో నిందితులు జి.అజయ్ అలియాస్ ఎస్‌కే ఇమ్రాన్, ఎం.మణికంఠలు ఒక బైకుపై ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వెళ్లారు. వెంటనే వారిని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపి నిలదీశా రు. దీంతో నిందితులిద్దరూ ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడికి దిగారు. ఈ మేరకు కానిస్టేబుల్ సదరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ కేసును సోమవారం విచారించిన కోర్టు ఈ మేరకు తీర్పు వెల్లడించింది.


