ఆహ్లాదకర వాతావరణంలో..! | - | Sakshi
Sakshi News home page

ఆహ్లాదకర వాతావరణంలో..!

Sep 2 2026 12:30 AM | Updated on Sep 2 2026 12:30 AM

ఆహ్లాదకర వాతావరణంలో..!

పూరీ మందిరంలో ఏసీ సౌకర్యం

భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటు

ఆలయ పవిత్రతకు ఇబ్బంది లేకుండా చర్యలు

భువనేశ్వర్‌: పూరీలోని జగన్నాథ స్వామివారి ఆలయాన్ని సందర్శించే భక్తులకు ఉక్కపోత, తేమ నుంచి ఉపశమనం లభించనుంది. ప్రధాన ఆలయం లోపల నాట్య మండపం ప్రాంగణంలో పూర్తిగా ఎయిర్‌ కండిషన్‌ (ఏసీ) సౌకర్యం కల్పించారు. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో భక్తులకు దర్శనానికి ఈ సదుపాయం సౌకర్యవంతమైన వాతావరణం కల్పిస్తుంది. నాట్య మండపం ప్రాంగణంలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న భక్తులు, యాత్రికుల చిరకాల కోరిక తీరింది. ఎయిర్‌ కండిషనింగ్‌ వ్యవస్థ పూర్తిస్థాయిలో పని చేయడం ప్రారంభమైంది. ముఖ్యంగా భొత్తొరొ కఠొ దర్శనం (లఘు దర్శనం) సమయంలో ఇటువంటి ఏర్పాటు ఉపశమనం కల్పిస్తుంది. ఈ ప్రాంగణంలో దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు గుమిగూడిన సమయంలో వేడి, తేమతో కూడిన వాతావరణం అలముకొని తీవ్ర అసౌకర్యం కలిగిస్తుంది. ఏసీ సదుపాయం అందుబాటులోకి రావడంతో జగన్నాథ స్వామి, ఆయన తోబుట్టువుల దర్శనం కోసం నాట్య మండపాన్ని సందర్శించే భక్తులు సౌకర్యవంతమైన వాతావరణంలో సమయం గడపగలుగుతారు. ఈ సదుపాయం ముఖ్యంగా వేసవి కాలంలో మరియు అధిక తేమ ఉండే సమయాల్లో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు.

పటిష్ట జాగ్రత్తలు

ఎయిర్‌ కండిషనింగ్‌ వ్యవస్థ వల్ల దేవతా విగ్రహాలకు, ఆలయ ఆచారాలకు లేదా శ్రీమందిరం వారసత్వ కట్టడాల పవిత్రతకు ఎలాంటి దుష్ప్రభావం కలగకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆలయ అధికారులు వివరించారు. ఆలయ ఆచారాలు, వారసత్వ సంరక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏసీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ వారసత్వ కట్టడం రక్షణ కోసం ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నాట్య మండపంలో వేరియబుల్‌ రిఫ్రిజెరేట్‌ ఫ్లో (వీఆర్‌ఎఫ్‌) టెక్నాలజీతో కూడిన ఆధునిక ఎయిర్‌ కండిషనింగ్‌ వ్యవస్థ పని చేస్తుంది. ఈ సదుపాయం నిరంతరాయంగా పనిచేసేలా చూసేందుకు దీనికి 5 ఏళ్ల నిర్వహణ మరియు మరమ్మతుల నిబంధనతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement