● 7 గంటల పాటు నిరవధికంగా శస్త్ర చికిత్స
● రోగి ప్రాణాలు కాపాడిన వైద్యుల బృందం
భువనేశ్వర్: హైటెక్ ఆస్పత్రిలో జరిగిన అరుదైన శస్త్ర చికిత్స ద్వారా ఒక రోగి మృత్యువు నుంచి బయటపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. గంజాం ప్రాంతానికి చెందిన సూరజ్ నాయక్ వృత్తిరీత్యా డ్రైవర్. అతడు చాలా కాలంగా ఛాతీ, వీపు, మెడలో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడు. కటక్ ఎస్‌సీబీ వైద్య బోధన ఆస్పత్రిలో చేరిన తర్వాత వ్యాధిని నిర్ధారించినా.. సకాలంలో శస్త్ర చికిత్స చేయలేకపోయారు. దీంతో అర్ధరాత్రి దాటిన తర్వాత హుటాహుటిన సూరజ్‌ను హైటెక్ వైద్య బోధన ఆస్పత్రిలో చేర్పించారు. వివిధ పరీక్షలు, సిటీ స్కాన్, ఈసీజీ, యాంజియోగ్రఫీ పరీక్షల ఆధారంగా రోగి గుండెలోని ప్రధాన ధమనిలో చీలిక ఏర్పడి దాని నుంచి రక్త ప్రవాహం గుండైపె తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోందని కనుగున్నారు. దీనికి తక్షణమే అవసరమైన శస్త్ర చికిత్స చేసేందుకు ప్రత్యేక వైద్య నిపుణుల బృందాన్ని సిద్ధం చేశారు. డాక్టర్ రితేష్ ఆచార్య, డాక్టర్ శ్వేతా దాస్, డాక్టర్ స్మృతి ప్రకాష్ సాహు, డాక్టర్ సత్య స్వరూప్ పట్నాయక్‌లతో కూడిన బృందం శస్త్ర చికిత్సకు నడుం బిగించింది. డాక్టర్ శ్వేతాంక్ దాస్ ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించారు.
శస్త్ర చికిత్స ఇలా...
వీరంతా సుమారు 7 గంటల పాటు నిరవధికంగా కొనసాగించిన శస్త్ర చికిత్సలో దాదాపు 34 నిమిషాల పాటు రోగి శరీరం అంతటికీ రక్త ప్రసరణను తాత్కాలికంగా నిలిపివేసి, కేవలం గుండెకు మాత్రమే కృత్రిమంగా వెంటిలేషన్ అందించారు. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడం ద్వారా సమగ్ర వైద్య బృందం ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి రోగిని మృత్యు ముప్పు నుంచి బతికించడం విశేషం. సాయంత్రం ప్రారంభమైన ఈ శస్త్ర చికిత్స తెల్లవారుజాము వరకు నిరవధికంగా కొనసాగింది. ఇలాంటి వ్యాధులతో 100 మందిలో 70 మంది రోగులు మరణించే ప్రమాదం ఉందని డాక్టర్ శ్వేతాంక్ దాస్ అన్నారు. డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి సారధ్యంలో అత్యాధునిక చికిత్సా విధానం అందుబాటులో ఉండడం వలన సూరజ్ నాయక్ ప్రాణాలను కాపాడడం సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆరోగ్య బీమా కార్డుపై ఈ శస్త్ర చికిత్స జరిగింది. రోగి ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు. కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత అతడు యథావిధిగా పనులన్నీ చేసుకోగలుగుతాడని వైద్య బృందం అభయం ఇచ్చింది.


