కంచిలి: ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్‌రెడ్డి మానవత్వం చాటుకున్నారు. సోమవారం ఉదయం ఇచ్ఛాపురం నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా పలాస మండల శాసనం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదానికి గురై రోడ్డు పక్కన పడివున్న వ్యక్తిని గమనించారు. హైవే మార్గంలో హైవే సేఫ్టీ సిగ్నల్ వాహనాన్ని ద్విచక్ర వాహనంతో ఢీకొని ప్రమాదానికి గురైన వ్యక్తిగా గుర్తించారు. అక్కడ ఆగి అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి గురించి అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి పలాస ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదానికి గురైన వ్యక్తికి చేయి విరగడంతోపాటు శరీరంపై గాయాలయ్యాయి. హెల్మెట్ ధరించడం వలన తలకు ఎటువంటి గాయాలు కాలేదు. శ్యాం ప్రసాద్‌రెడ్డి ప్రమాదానికి గురైన వ్యక్తికి అందించిన సహాయానికి పలువురు అభినందించారు.
విద్యుత్ శాఖ ఉద్యోగి ఆత్మహత్య
కాశీబుగ్గ: పలాస విద్యుత్ డివిజన్‌లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఒక ఉద్యోగి అదే కార్యాలయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు, విద్యుత్ సిబ్బంది సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న కంచి సంతోష్‌కుమార్ (31) సోమవారం ఉదయం కార్యాలయానికి వచ్చాడు. తన బ్యాగును బయటే ఉంచి నేరుగా డాబాపైకి వెళ్లి, అదే కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న ఉద్యోగినికి ఫోన్ చేశాడు. అనంతరం డాబాపై ఉన్న సోలార్ ప్యానల్ బోర్డులకు వేలాడుతున్న వైర్లతో ఉరేసుకున్నాడు. విషయాన్ని తెలుసుకున్న అటెండర్ వెంటనే వచ్చి డాబాపైకి వెళ్లి చూసి కేకలు వేసింది. స్పందించిన కార్యాలయ సిబ్బంది సంతోష్‌కుమార్‌ను పలాస ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సారా ప్యాకెట్లతో వ్యక్తి అరెస్టు
కంచిలి: మండలంలోని తలతంపర పంచాయతీ పరిధి కాకర్లపుట్టుగ గ్రామంలో సోంపేట ఎకై ్సజ్ శాఖ సిబ్బంది సోమవారం దాడులు నిర్వహించారు. దీనిలో భాగంగా ఆ గ్రామానికి చెందిన కాకర్ల దాలయ్య అనే పాత ముద్దాయి నుంచి 100 నాటుసారా ప్యాకెట్లు(సుమారు 10 లీటర్లు) స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి, సోంపేట కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. విచారణలో భాగంగా సదరు వ్యక్తికి నాటుసారా సరఫరా చేసిన శ్రీరాంపురం గ్రామానికి చెందిన లండ నవీన్ మీద కూడా కేసు నమోదు చేశారు. ఒడిశా నుంచి నాటుసారా రవాణా అరికట్టడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు సీఐ జి.వి.రమణ తెలిపారు. గతంలో నాటుసారా కేసులు కలిగి ఉన్న అందరి మీద ప్రత్యేక నిఘా ఉందన్నారు. దాడుల్లో ఎస్‌ఐ ప్రసాద్, సిబ్బంది కృష్ణమూర్తి, ఉమాపతి, మార్కారావు తదితరులు పాల్గొన్నారు.
చిన్నారులపై లైంగిక వేధింపులు
● టీచర్‌పై పోక్సో కేసు నమోదు
● ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం మండల పరిధిలోని ఓ మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. గడిచిన ఐదేళ్లుగా ఒకే పాఠశాలలో ఈ టీచర్ పనిచేస్తున్నారు. ఆగస్టు 29న శనివారం వాష్‌రూంకు వెళ్లిన బాలికలపై లైంగిక దాడికి పాల్పడడంతో ఇద్దరు బాలికలు తల్లిదండ్రులకు విషయాన్ని చేరవేశారు. మరుసటి రోజు ఆదివారం కావడంతో మిన్నకుండిపోయారు. సోమవారం ఉదయం స్కూల్‌కు రాగానే గ్రామస్తులందరూ వెళ్లి ఆ ఉపాధ్యాయుడిని నిలదీశారు. ఇదే విషయంపై రూరల్ పోలీసులకు బాలిక తల్లిదండ్రులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖాధికారులు, రూరల్ పోలీసులు పాఠశాలకు వెళ్లి విచారణ చేశారు. వెంటనే పాఠశాల ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకొని అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.


