జాతీయ సైన్స్‌ ఎగ్జిబిషన్‌కు నవోదయ విద్యార్థి | - | Sakshi
Sakshi News home page

జాతీయ సైన్స్‌ ఎగ్జిబిషన్‌కు నవోదయ విద్యార్థి

Aug 29 2026 1:52 AM | Updated on Aug 29 2026 1:52 AM

సరుబుజ్జిలి: అహ్మదాబాద్‌లో ఈ నెల 31 నుంచి సెప్టెంబర్‌ 2 వరకు జరగనున్న జాతీయ సైన్స్‌ ఎగ్జిబిషన్‌కు 10 వతరగతి విద్యార్థి విద్యాశ్రీమహంతి ఎంపికై నట్లు వెన్నెలవలస జవహర్‌ నవోదయ విద్యాలయం ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ బేతనసామి శుక్రవారం తెలిపారు. మహంతి ఎగ్జిబిషన్‌ పోటీల్లో చక్కగా రాణించి అత్యుత్తమ ప్రతిభ చూపాలని కోరారు.

ఆదిత్యుడిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి

శ్రీకాకుళం కల్చరల్‌: ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామిని శుక్రవారం ఉదయం హైకోర్టు జడ్జి జస్టిస్‌ గేదెల తుహిన్‌ కుమార్‌ దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. శ్రీకూర్మంలోనూ స్వామిని దర్శించుకున్నారు.

‘పీ–4లో లక్ష మందిని చేర్చాం’

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: అట్టడుగు వర్గాల సంక్షేమానికి ఉద్దేశించిన ‘పీ–4’ కార్యక్రమం మంచిదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. శుక్రవారం అమరావతి సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షకు శ్రీకాకుళం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఇతర అధికారులతో కలిసి ఆయన హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా లో లక్ష మందికి పైగా లబ్ధిదారులను గుర్తించగా, ఇప్పటికే 51 వేల మందిని మార్గదర్శకులకు అనుసంధానం చేసి వారి ఉపాధికి పూర్తి తోడ్పాటు అందిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జిల్లాలోని దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ క్రమంగా పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసి, నేపాల్‌ ఎంబసీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు.

రెండో రోజూ విధుల బహిష్కరణ

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక ‘న్యాయవాద రక్షణ చట్టం’ తీసుకురావాలని కోరుతూ న్యాయవాదులు చేపట్టిన విధుల బహిష్కరణ రెండో రోజైన శుక్రవారం కూడా కొనసాగింది. శ్రీకాకుళం జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కూన రాజారావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. న్యాయవాదుల రక్షణకు చట్టబద్ధమైన భద్రత కల్పించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరినా ఇప్పటి వరకు చర్యలు లేవన్నారు. చట్టాల అమలు కోసం వాదించి, కృషి చేసే న్యాయవాదులకే తగిన రక్షణ లేకపోవడం విచారకరమన్నారు.

రోడ్డు ప్రమాదంలో కూరగాయల వ్యాపారి మృతి

వజ్రపుకొత్తూరు రూరల్‌: రాఖీ పండగ రోజున ఇంటి పెద్దదిక్కు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం చోటు చేసుకుంది. పలాస మండలం చినమామిడి మెట్ట గ్రా మానికి చెందిన కూరగాయల చిరు వ్యాపారి చెల్లూరి బైరాగి(75) శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బైరాగి ప్రతి రోజు తన ద్విచక్రవాహనంపై గ్రామాల్లో తిరుగుతూ కూరగాయలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగానే ఆయన శుక్రవారం తన కూరగాయల బండితో ఇంటి నుంచి బయల్దేరారు. తన భార్య దమయంతితో కలిసి గ్రామం నుంచి పలాస వస్తుండగా ఎన్‌హెచ్‌–16 జాతీయ రహదారిపై మాకన్నపల్లి వద్ద లారీ ఢీ కొట్టడంతో బైరాగి అక్కడికక్కడే మృతి చెందగా భార్య దమయంతి తీవ్ర గాయాలకు గురైంది. స్థానికులు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఆమెను పలాస ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరు కొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్‌ఐ సీహెచ్‌ దుర్గాప్రసాద్‌ తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement