యానిమేషన్‌ సినిమా వివాదాస్పదం | - | Sakshi
Sakshi News home page

యానిమేషన్‌ సినిమా వివాదాస్పదం

Aug 27 2026 1:48 AM | Updated on Aug 27 2026 1:48 AM

భువనేశ్వర్‌: పూరీ జగన్నాథునిపై రూపొందుతున్న యానిమేషన్‌ చిత్రంపై పెద్ద వివాదం చెలరేగింది. ఈ చిత్రం విడుదలను పూర్తిగా నిషేధించాలని పూరీలోని గోవర్ధన పీఠాధిపతి శంకరాచార్యులు స్వామి నిశ్చలానంద సరస్వతి కోరారు. శ్రీ మందిరం ముక్తి మండపం పండిత సభ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు పూరీ గజపతి మహారాజుకు లేఖ ద్వారా తమ తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేసింది. యానిమేషన్‌ చిత్రం జగన్నాథుని సంప్రదాయం, సంస్కృతి, తత్వాన్ని (తత్వాన్ని) నాశనం చేస్తోందని స్వామి నిశ్చలానంద సరస్వతి పేర్కొన్నారు. సినిమాలో జగన్నాథుడిని వక్రీకరించి అభ్యంతరకరమైన రీతిలో చిత్రీకరించారని,. ఇది చట్టబద్ధంగా అనుమతించకూడని క్షమించరాని నేరమని తీవ్రంగా ఆరోపించారు. సినిమా విడుదల, అన్ని మీడియా మాధ్యమాల్లో దాని ప్రసారాన్ని తక్షణమే నిషేధించాలని శంకరాచార్య డిమాండ్‌ చేశారు. దైవం సంప్రదాయ, శాసీ్త్రయ స్వరూపాన్ని వక్రీకరించే ఏ చిత్రీకరణను అంగీకరించలేమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదలను నిలిపివేయడానికి నిరాకరించిన సుప్రీం కోర్టు గత తీర్పును సమీక్షించాలని పూరీలోని గోవర్ధన పీఠాధిపతి శంకరాచార్యులు స్వామి నిశ్చలానంద సరస్వతి అభ్యర్థించారు. ఈ పరిణామం ఒడిశాలోని మత, సాంస్కృతిక వర్గాలలో విస్తృత చర్చకు దారి తీసింది. సాంప్రదాయ సంస్థలు సినిమాలోని అంశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

సమాచార శాఖ డైరెక్టర్‌గా సంజయ్‌కుమార్‌ బిస్వాల్‌

భువనేశ్వర్‌: రాష్ట్ర ప్రభుత్వం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ కుమార్‌ బిస్వాల్‌ను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల (ఐ అండ్‌ పీఆర్‌) విభాగం డైరెక్టర్‌గా నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన, ప్రజా ఫిర్యాదుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2015 నాన్‌–స్టేట్‌ సివిల్‌ సర్వీస్‌ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అయిన సంజయ్‌ ప్రస్తుతం వాణిజ్య, రవాణా శాఖలో ప్రభుత్వ అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అదే విధంగా, ప్రస్తుతం మాధ్యమిక విద్యా శాఖ డైరెక్టర్‌గా ఉన్న బీరేంద్ర కోర్కోరా (ఎస్‌సీఎస్‌–2014) హోం శాఖలో అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. ఓబీసీ డైరెక్టర్‌గా ఉన్న జుగలేశ్వరి దాస్‌ (ఎస్‌సీఎస్‌–2015) మాధ్యమిక విద్యా శాఖ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అబ్కారీ శాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్న అర్చనదాస్‌ పట్నాయక్‌ (ఎస్‌సీఎస్‌–2015) ఆయుష్‌ డైరెక్టర్‌గా, ప్రస్తుతం ఆయుష్‌ డైరెక్టర్‌గా ఉన్న అంజనా పండా (ఎస్‌సీఎస్‌–2015) అబ్కారీ శాఖ అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. నిర్మాణాల శాఖలో డిప్యూటీ కార్యదర్శిగా ఉన్న సుందర మాధవ పాఢి (ఎన్‌ఎస్‌సీఎస్‌–2020)ని ఒడిశా మారిటైమ్‌ బోర్డు చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా బదిలీ చేశారు. ఆయన ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఓఎస్‌ఆర్‌టీసీ) జనరల్‌ మేనేజర్‌గా అదనపు బాధ్యతలతో కొనసాగుతారు.

అజయగడలో వారపు సంత భవనం ప్రారంభం

పర్లాకిమిడి: గుమ్మాబ్లాక్‌ అజయగడ గ్రామంలో వారపు సంత భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా అజయగడ ప్రజలు నిరీక్షిస్తునకు ఎట్టకేలకు ముగింపు పలికామన్నారు. భవన నిర్మాణంతో వారపు సంతకు ప్రతి బుధవారం చుట్టుపక్కల గిరిజనులు తమ ఉత్పత్తులు అమ్ము కోవడానికి, ఆర్థిక వెసులుబాటుకు, వారికి ఆర్ధికాభివృద్ధి ఉపయోగపడుతోందని ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి ఈ సందర్భంగా అన్నారు. అనంతరం అజయగడ సర్పంచు సులేమీ శోబోరో నేతృత్వంలో వారపు సంత అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రాజారావు బోడోనాయక్‌, కార్యదర్శులుగా సురేష్‌ నాగా, మాల్యబంత బోడోదోళాయి, కోశాధికారిగా సుభాస్‌ మచ్ఛో కలిసి ఈ ప్రాంతంలో ప్రచారం చేపట్టారు. ఈ వారపు సంత వల్ల ఈ ప్రాంతపు వ్యవసాయదారులు, గిరిజనులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ వారపు సంత ప్రారంభోత్సవంలో గుమ్మా సమితి అధ్యక్షులు సునేమీ మండళ్‌, గుమ్మ బీడీవో దులారాం మరాండి, తహసీల్దార్‌ శరత్‌ శోబోరో, ఎల్‌.ఎస్‌.డి.ముఖ్యులు ఆకాష్‌ దిగాల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement