● సీపీఐ నాయకుల ఆందోళన
జయపురం: నూతన మైనింగ్ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. మైనింగ్ చట్టం–1957ను పూర్తిగా మార్పు చేసి ఎం.ఎం.డి.ఆర్.చట్టం 2026ను కేంద్రంలోని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వ ఆమోదించిందని.. ఆ చట్టాన్ని రాష్ట్రపతి కూడా ఆమోదించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అది ఒడిశా గనుల తవ్వకాలకు వ్యతిరేకమని.. కొత్త చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కమ్యూనిస్టు పార్టీ కొరాపుట్ జిల్లా డిమాండ్ చేసింది. ఆ పార్టీ ఆధ్వర్యంలో ఎంఎండీఆర్–2026 మైనింగ్ చట్టానికి వ్యతిరేకంగా బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టం వెనుక కుట్ర ఉందన్నారు. ముఖ్యంగా టాటా కంపెనీకి ఒక లక్షా పది వేల కోట్ల రూపాయల బకాయిని చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తూ తీర్పు ఇచ్చిందన్నారు. ఈ చట్టం వలన ఆ డబ్బు ఇక ముందు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించనక్కర లేదన్నారు. అంతే కాకుండా ప్రతి ఏడాది ఒడిశా నుంచి కేంద్ర ప్రభుత్వం రూ. 12 వేల కోట్ల విలువైన ఖనిజ సంపదను వెలికి తీసే హక్కును పొందటమే కాకుండా వాటిని నియంత్రించే హక్కను ఈ నియంత్ర చట్టం ద్వారా పొందుతుందన్నారు. అందువలన ఒడిశా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడుతుందని కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని చేకూర్చే ఎం.ఎం.డి.ఆర్– 2026 చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ఒడిశా ప్రభుత్వం శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన నూతన మైనింగ్ చట్టంపై చర్చించి నూతన చట్టాన్ని రద్దు చేసేలా తీర్మానం చేయాలని కోరారు. ఒడిశా ప్రభుత్వం ప్రతిపక్షాల డిమాండ్‌ను అంగీకరించక పోతే సెప్టెంబర్ తొమ్మిదో తేదీన భువనేశ్వర్‌లో ప్రజా సదస్సు నిర్వహిస్తామని కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ కమిటీ సభ్యులు ప్రమోద్ కుమార్ మహంతి వెల్లడించారు. అవసరమైతే ఒడిశా బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులపై కఠిన చర్యలు చేపడుతూ, పంచదార, బియ్యం మొదలగు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెంచిందన్నారు. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా విద్యావ్యవస్థను నాశనం చేస్తుందన్నారు. ఇందులో భాగంగా సుమారు లక్షకు పైగా పాఠశాలలను దేశ వ్యాప్తంగా మూసివేసిందని ధ్వజమెత్తారు. కేంద్రం వ్యవహిరిస్తున్న ప్రజావ్యతిరేక కుయుక్తులను సహించబోమని ఏఐటీయుసీ కొరాపుట్ జిల్లా అద్యక్షులు జుధిష్టర్ రౌళో హెచ్చరించారు. సెప్టెంబర్ ఒకటో తేదీ చేపట్టనున్న చలో ఢిల్లీ ఉద్యమాన్ని విజయవంతం చేయటానికి, ఖనిజ సంపదకు నిలయమైన కొరాపుట్ జిల్లాలో ఎం.ఎం.డి.ఆర్. 2026 చట్టంపై ప్రజలకు వివరించేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపు నిచ్చారు. ఆందోళనలో కమ్యూనిస్టు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి బుద్రా బొడొనాయిక్, సుదర్శణ బిశాయి, వసంత బెహర, రతన్ నాయి క్, భీష్మ నాయిక్, బాదల్ పొరజ, వికాశ పొరజ, అధికసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.


