● 14 రోజులుగా కనిపెట్టని పోలీసులు
● తల్లిదండ్రుల్లో ఆందోళన
● పోలీసుల దర్యాప్తుపై విమర్శలు
రాయగడ: జిల్లాలోని చంద్రపూర్ సమితి డంగసొరడ ఎస్సీ, ఎస్టీ పాఠశాల వసతి గృహం నుంచి ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యమై 14 రోజులు గడిచినా ఇప్పటివరకు ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి తల్లిదండ్రులు గురువారం పాఠశాలకు వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థి అదృశ్యమైన ఘటనలో పాఠశాల యాజమాన్యం వ్యవహరించిన తీరుపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు 14 రోజులు గడిచినా విద్యార్థిని గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారని.. మరోవైపు బాధ్యతను విద్యార్థి తల్లిపై మోపేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు.
దర్యాప్తుపై గ్రామస్తుల అసంతృప్తి
విద్యార్థి ఆచూకీ కోసం పోలీసులు చేపడుతున్న దర్యాప్తుపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థిని గుర్తించేందుకు ఆశించిన స్థాయిలో దర్యాప్తు జరగడం లేదని ఆరోపించారు. విద్యార్థి అదృశ్యంపై నిరసన చేపట్టేందుకు ప్రయత్నించిన గ్రామస్తులను ర్యాలీ నిర్వహించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారని, ర్యాలీ నిర్వహిస్తే అరెస్టు చేస్తామని చెప్పినట్లు మండిపడుతున్నారు. వీలైనంత త్వరగా విద్యార్థి ని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించాలన్నారు. లేకుంటే చంద్రపూర్ సమితితో పాటు రాయగడ జిల్లావ్యాప్తంగా ఆదివాసీలు, స్థానిక ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆదివాసీ నాయకురాలు ధరణి సరక హెచ్చరించారు. విద్యార్థి అదృశ్యంపై జిల్లా సంక్షేమ శాఖ అధికారి, ఇతర అధికారులకు వినతిపత్రం అందించేందుకు రాయగడ వచ్చిన కుటుంబ సభ్యుల నుంచి వినతిపత్రం స్వీకరించలేదని ఆమె ఆరోపించారు. ఇదిలా ఉండగా విద్యార్థి తల్లి గీతాంజలి సబర్ తన కుమారుడుని సురక్షితంగా తిరిగి తీసుకురావాలని అధికారులను వేడుకున్నారు. తన బిడ్డను ఎలాగైనా సజీవంగా ఇంటికి తీసుకురావాలని కన్నీటిపర్యంతమయ్యారు. సమాచారం అందుకున్న మునిగుడ పోలీసులు పాఠశాలకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో చర్చలు జరిపారు.


