ఝార్సుగుడ ఎస్పీకి అరుదైన గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

ఝార్సుగుడ ఎస్పీకి అరుదైన గుర్తింపు

Aug 15 2026 2:15 AM | Updated on Aug 15 2026 2:15 AM

టాప్‌ 100 ఐపీఎస్‌ అధికారుల జాబితాలో రాఘవేంద్రకు స్థానం

రాయగడ: జార్సుగుడ జిల్లా ఎస్పీ జి.ఆర్‌.రాఘవేంద్ర దేశవ్యాప్తంగా అత్యుత్తమంగా పనిచేస్తున్న టాప్‌ 100 ఐపీఎస్‌ అధికారుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. నాయకత్వ సామర్ధ్యం, వృత్తి పరమైన పోలీసింగ్‌, నూతన ఆలోచనల అమలు, నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణతోపాటు ప్రజా కేంద్రీకృత పోలీసింగ్‌లొ ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. ఝార్సుగుడ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన దర్యాప్తు, ముందస్తు నేర నివారణ, మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్‌ నేరాల ఛేదన, కేసుల వేగవంతమైన దర్యాప్తు, బలహీన వర్గాల రక్షణ, పోలీసులపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన నాయకత్వంలో ఝార్సుగుడ పోలీసులు పలు కీలక విజయాలను సాధించారు. జిల్లా వారీగా ప్రగతీ డ్యాష్‌ బోర్డులొ రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని సాధించడంతోపాటు అదృశ్యమైన చిన్నారులను గుర్తించడంలొ 95.7 శాతం ట్రేసింగ్‌ రేటును నమోదు చేసుకున్నారు. అలాగే హత్యలు, దోపీడీలు, ఏటీఎం కేసుల వంటి తీవ్రమైన నేరాలను ఛేదించడంతో పాటు భారీగా మాదక ద్రవ్యాలు, అక్రమ ఆయుధాలనను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యమైన పోక్సో, ఇతర క్రిమినల్‌ కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా దర్యాప్తు చేపట్టారు. ఆపరేషన్‌ నేత్ర, సైబర్‌ కవచ్‌, నిషా ముక్త ఒడిశా అభియాన్‌, మోబైల్‌ హ్యాండ్‌ ఓవర్‌ మేళా, స్మార్ట్‌ ఆటో ట్రాకింగ్‌ సిస్టమ్‌ వంటి వినూత్న కార్యక్రమాలు జిల్లాలో పోలీసింగ్‌ వ్యవస్థను మరింత బతోపేతం చేశాయి. దేశవ్యాప్తంగా టాప్‌–100 ఐపీఎస్‌ అధికారుల జాబితాలో రాఘేవేంద్రకు చోటు దక్కడం ఝార్సుగుడ పోలీసులతో పాటు ఒడిశా పోలీసులకు కూడా గర్వకారణంగా నిలిచింది. ఈ గుర్తింపు జిల్లా పోలీసుల వినూత్న కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకువచ్చింది. ఈ గౌరవాన్ని ఆయన ఝార్సుగుడ పోలీసు బృందానికి అంకితం చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది అంకితభావంతో చేసిన కృషి ఫలితంగానే ఈ గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. ప్రజలకు వృత్తి నైపుణ్యం, సున్నితత్వం, నూతన ఆలొచనలతో సేవలందించడంతో పాటు నేరాల పట్ల జీరో టాలరెన్స్‌ విధానాన్ని కొనసాగిస్తామని రాఘవేంద్ర తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement