ఆకట్టుకున్న విజ్ఞాన
మేళా
విజ్ఞానాన్ని..
విజ్ఞాన ప్రదర్శనకు విచ్చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులు
పర్లాకిమిడి:
విద్యార్థులు ప్రాథమిక దశనుంచే విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని వక్తలు అన్నారు. పట్టణంలోని సొండివీధి వద్ద ఉన్న సరస్వతీ శిశు విద్యామందిర్‌లో శనివారం జ్ఞాన విజ్ఞాన మేళాను నిర్వహించారు. ఎస్‌కేసీజీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ (కెమిస్ట్రీ) డాక్టర్ సునశ్రీ మిశ్రా రిబ్బన్ కట్‌చేసి మేళాను ప్రారంభించారు. ముఖ్యవక్తగా ఎస్‌కేసీజీ కళాశాల అసిస్టెంటు ప్రొఫెసర్ డాక్టర్ సౌరభ్ మహాంత, మహాంత రామానంద్ దాస్, శిశుమందిర్ విద్యాకమిటీ కార్యదర్శి చంద్రశేఖర్ పట్నాయక్, ఉపాధ్యక్షులు సంజయ్ జెన్నా, మాజీ బీఈవో బాలక్రిష్ణ మఝి పాల్గొన్నారు. విద్యాలయ కమిటీ అధ్యక్షులు సుభాష్ చంద్ర జమాదార్ అధ్యక్ష వహించారు. జ్ఞాన విజ్ఞాన మేళాలో ముఖ్యఅతిథి మాట్లాడుతూ.. విద్యార్థులు విజ్ఞాన మేళాల ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి ప్రాజెక్టులు ప్రదర్శించడానికి దోహదపడుతోందని డాక్టర్ సునశ్రీ మిశ్రా అన్నారు. ఈ సందర్భంగా సౌరశక్తి, పవన్ శక్తి, జలవిద్యుత్, భూకంపాలు ఏర్పడినప్పుడు తట్టుకునే ఇళ్ల నిర్మాణం, భవిష్యత్తులో సూర్యరశ్మితో విద్యుత్ ప్రాజెక్టులు, సాగునీరు అందించే యంత్రాలు తదితర 130 ప్రాజెక్టులను వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించారు. వాటన్నిటిని న్యాయనిర్ణేతలు, ప్రొఫెసర్లు సందర్శించి వాటి ఉపయోగాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం తుది ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులు ప్రాజెక్టులు ఈనెల 22న గంజాం జిల్లా హింజిలికాటు విద్యాలయంలో జరగనున్న ఫైనల్స్ పోటీలకు అర్హత సాధించినట్టు విద్యాలయం ప్రధాన ఆచార్యులు సరోజ్ పండా తెలిపారు. కార్యక్రమంలో ఏడుగురు సైన్స్ ఉపాధ్యాయులకు ముఖ్యఅతిథి చేతులమీదుగా దుశ్శాలువతో సన్మానించారు. సీనియర్ ఉపాధ్యాయులు శ్రద్ధామయ పాఢి సమన్వయకర్తగా వ్యవహారించారు.


