● జెన్–జీతో సహా అందరికీ అభినందనలు ● ఎంపీ అపరాజిత
కొరాపుట్: జెన్–జీతో సహా అందరికీ అభినందనలు అని బీజేపీకి చెందిన భువనేశ్వర్ ఎంపీ అపరాజితా షడంగి అన్నారు. కొరాపుట్ జిల్లాలోని సిమిలిగుడ కాలేజీలో శనివారం జరిగిన వార్షికోత్సవ సభలో ప్రసంగించి ఆశ్చర్య పరిచారు. బీజేపీ నేతల నోట పలకని జెన్–జీ పదాన్ని అపరాజిత ఉటంకించారు. తాను జెన్–జీతో పాటు వారికన్నా చిన్న వారికి కూడా అభినందనలు తెలియజేశారు. 26 ఏళ్ల క్రితం కొరాపుట్ జిల్లా కలెక్టర్‌గా పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ రోజు తాను కొరాపుట్ జిల్లాకు రావడం పుట్టింటికి వచ్చినట్లయిందన్నారు. 1999–20 మధ్య తాను కొరాపుట్ జిల్లాలోని 14 సమితుల్లో కలియ తిరిగానని గుర్తు చేసుకున్నారు. తాను రాజకీయాలలో ఉన్నప్పటికీ కొరాపుట్ ప్రజల కుటుంబ సభ్యురాలినేనన్నారు. విద్యార్థులు దేశ భవిష్యత్ నిర్మాతలన్నారు. పుస్తకాలు చదవాలని యువతకి నిర్ధేశించారు. తన పిల్లలకు కూడా కఠోర పరిశ్రమ నేర్పించానన్నారు. సిమిలిగుడలో సీతం ఇంజినీరింగ్ కాలేజీలో 2000 మందికి పైగా విద్యార్థులు చదువుతుండడం అభినందనీయమన్నారు. భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాక్రిష్టన్ ముందుతరాలకు విద్య కోసం బాటలు వేశారన్నారు. విద్య క్రమశిక్షణకు ముందు మార్గమన్నారు. యువత పాజిటివ్ దృక్పథాన్ని కలిగి ఉండాలన్నారు. ధమంజోడిలోని భారత అల్యూమినియం కేంద్రం (నాల్కో) కూడా ఈ ప్రాంతంలో విద్యకి సహకరించాలన్నారు. సిమిలిగుడ కాలేజీలో తాను లేబరోటరీ సందర్శించానన్నారు. నాల్కో పెద్ద మనసు చేసుకొని కాలేజీ లెబరోటరీకి ఆర్థిక సహాయం చేయాలని సూచించారు. తాను 24 ఏళ్లు ఐఏఎస్‌గా ఏన్నో ప్రాంతాల్లో పని చేసినట్టు పేర్కొన్నారు. భువనేశ్వర్ నుంచి రెండుసార్లు లోక్‌సభకి ఎన్నికయ్యాన్నారు. తన తల్లిదండ్రులు కూడా సామన్య ఉపాధ్యాయులేనని గుర్తు చేసుకున్నారు. తరగతిలో ఉపాధ్యాయులు ఒక పిరియడ్‌లో 45 నిమిషాల బోధన దేశ భవిష్యత్‌పై ఆధారపడి ఉందన్నారు. అందుకే ఉపాధ్యాయులు తరగతి గదిలో బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. తన మిత్రులలో తెలుగు కూడా ఉన్నారన్నారు. అనేక భాషలపై పట్టు సాధించాలని యువతకి సూచించారు. ఇంగ్లిష్ అవసరమే గానీ ఒడియాకి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అపరాజీత పేర్కొన్నారు. అంతకు ముందు దమంజోడి రైల్వే స్టేషన్‌లో అపరాజితాకి బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్మికుల సమావేశంలో మొక్కలు నాటారు. సిమిలిగుడలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. పలు చోట్ల పార్టీలకు అతీతంగా ప్రజలు స్వాగతం పలికారు. కార్యక్రమాల్లో సునాబెడా మున్సిపల్ చైర్మన్ రాజేంద్ర కుమార్ పాత్రో పాల్గొన్నారు.


