న్యూస్‌రీల్
గురువారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2026
వర్సిటీ వ్యవహారాల్లో..
● రెవెన్షా ఉపాధ్యాయుల నిరసన
భువనేశ్వర్: కటక్ రెవెన్షా విశ్వవిద్యాలయ ఉపాధ్యాయ సంఘం (ఆర్‌యూటీఏ) బుధవారం వైస్ చాన్స్‌లర్ కార్యాలయం వరకు శాంతియుత ప్రదర్శన నిర్వహించింది. ఉపాధ్యాయులు నిరసనకు దిగడంతో క్యాంపస్‌లో ఉద్రిక్తత తీవ్రమైంది. విశ్వవిద్యాలయ వ్యవహారాల్లో రాజకీయ జోక్యం జరుగుతోంది. ఉపాధ్యాయులకు గౌరవం, సంస్థకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని సెవెన్ పిల్లర్స్ ఆఫ్ విజ్డమ్ నుంచి ఉపాధ్యాయులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు. విశ్వ విద్యాలయ పాలనా వ్యవహారాల్లో రాజకీయ జోక్యం నివారణ, ఉపాధ్యాయుల గౌరవానికి రక్షణ, వైస్ చాన్స్‌లర్ పదవికి, సంస్థకు గౌరవం అనే 4 ప్రధాన డిమాండ్లతో కూడిన స్మారక పత్రాన్ని సమర్పించారు. హాస్టల్ సంబంధిత సమస్యపై విద్యార్థుల ఆందోళన సందర్భంగా ఆగస్టు 3న విద్యార్థుల సమక్షంలో చీఫ్ వార్డెన్ పదవిలో ఉన్న ఒక సీనియర్ ప్రొఫెసర్‌పై అనుచితంగా ప్రవర్తించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఉపాధ్యాయ సంఘం ప్రధానంగా ఆరోపిస్తుంది.
ఆగస్టు 3న విద్యార్థులు ఆందోళన చేస్తున్నప్పుడు వైస్ చాన్స్‌లర్, చీఫ్ వార్డెన్, వార్డెన్ విద్యార్థులను బుజ్జగించి దాదాపుగా శాంతింపజేయడంతో సమస్య పరిష్కారమైంది. ఆ సమయంలో కటక్ సదర్ ఎమ్మెల్యే అక్కడికి వచ్చి విద్యార్థులను రెచ్చగొట్టారని నిరసనకు దిగిన ఉపా
ధ్యాయుల వర్గం ఆరోపణ. సీనియర్ ప్రొఫెసర్ అయిన చీఫ్ వార్డెన్‌తో ఆమోదయోగ్యం కాని రీతిలో ప్రజా ప్రతినిధి ప్రవర్తించారు. ఆయనపై కఠినమైన భాషాజాలం ప్రయోగించారు. ఈ విషయంలో రాజకీయ జోక్యం అనవసరం అని ఉపాధ్యాయ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మరో వైపు తాము ఎమ్మెల్యేను క్యాంపస్‌కు పిలవలేదని విద్యార్థులు కూడా స్పష్టం చేశారు.
వైస్ చాన్స్‌లర్‌తో ముందస్తు సంప్రదింపులతో విశ్వవిద్యాలయ విషయానికి సంబంధించి చొరవ కల్పించుకోవడం మర్యాదపూర్వక ప్రవర్తనగా పేర్కొన్నారు. అలా కాకుండా అప్రమేయంగా చొరవ కల్పించుకుని విద్యార్థుల ముందు సీనియర్ ప్రొఫెసర్లను అవమానించడం సమగ్ర సంస్థ గౌరవాన్ని దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం అవుతుంది. వివాదం నేపథ్యంలో మంగళ వారం హాస్టల్ వార్డెన్లు, డిప్యూటీ వార్డెన్లు అందరూ సామూహికంగా రాజీనామాలు సమర్పించారని ఓ అధ్యాపకుడు తెలిపారు.
ఈ విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి వైస్ చాన్స్‌లర్ 7 రోజుల సమయం తీసుకున్నారు. ఈ వ్యవధిలో ఆయన ప్రొఫెసర్లతో కూడా చర్చలు జరిపి, తగిన చర్యలు తీసుకుంటామని నిరసనకు దిగిన ఉపాధ్యాయ వర్గానికి హామీ ఇచ్చారు. వేధింపులు, హాస్టల్ గదులకు తాళాలు వేయడం వంటి ఆరోపణల నేపథ్యంలో డిప్యూటీ వార్డెన్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ రెవెన్షా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఈ నెల 2 నుంచి చేపట్టిన నిరాహార దీక్షను నిరవధికంగా కొనసాగిస్తున్నారు.


