భువనేశ్వర్: పూరీ జగన్నాథ ఆలయ రక్షణ సిబ్బంది నియామకానికి సంబంధించి నకిలీ నియామక పత్రాలు వైరల్ అవుతున్నాయి. ఎస్‌జేటీఏ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ సంతకంతో ఉన్నట్లు ఒక నకిలీ నియామక పత్రం వైరల్ అయ్యింది. ఈ మేరకు ఆలయ పరిపాలన విభాగం సింహద్వార్ పోలీస్ ఠాణాలో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి ఆ లేఖ పూర్తిగా నకిలీదని పేర్కొంది.
జోరుగా పుట్టగొడుగుల విక్రయాలు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని డీఎన్‌కే మార్కెట్‌లో శ్రవణ పుట్టగొడుగుల విక్రయాలు జోరుగా బుధవారం ప్రారంభమయ్యాయి. వర్షాలు కురిస్తే అడవుల్లో పుట్టగొడుగులు వస్తాయి. వీటిని గిరిజనులు తీసుకొచ్చి స్థానికంగా అమ్ముతారు. ఎంతో రుచికరమైన వీటిని ప్రజలు భారీగా కొనుగోలు చేస్తారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
కొరాపుట్: కొరాపుట్ జిల్లా కుందిలి సంత ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి సంచరిస్తూ అనారోగ్యం పాలయ్యారు. వెంటనే స్థానికులు అతడిని చికిత్స కోసం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాలకు తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కొరాపుట్ పోలీసులు ఆయన ఫొటోను విడుదల చేశారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే ఆస్పత్రికి రావాలని సూచించారు.
పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
కొరాపుట్: చెట్టుకి ఉరి వేసుకొని 10వ తరగతి విద్యా ర్థిని ఆత్మహత్య చేసుకుంది. బుధవారం నబరంగ్‌పూర్ జిల్లా జొరిగాం సమితి చచ్చా గ్రామ పంచాయితీ గబగుడ గ్రామానికి చెందిన సుందర్ సింగ్ మెహర్ కుమార్తె గిరిజ మెహర్ (15) తన ఇంటి ముందు మామిడి చెట్టుకి తన ఓణీతో ఉరి వేసుకుంది. ముందు రోజు కుటుంబ సభ్యులతో పొలం పనిచేసి వచ్చి రాత్రి వంట కూడా చేసింది. అందరిలో కలిసి భోజనం చేసి ఇంటిలోనే నిద్రపోయింది. ఉదయం చూసే సరికి చెట్టుకు మృతదేహమై వేలాడుతూ కనిపించింది. జొరిగాం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జొరిగా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గిరిజ సమీప ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
చెరువును బాగు చేస్తాం
పర్లాకిమిడి: గజపతి జిల్లా గుమ్మాబ్లాక్ జోగిపాడు గ్రామంలో బోడోబోందో (చెరువు) వర్షాభావం వల్ల ఎండిపోయి పిచ్చిమొక్కలు పేరుకుపోయింది. గ్రామంలో వంద ఎకరాలకు ఖరీఫ్‌లో సాగునీరు అందివ్వలేకపోయింది. రైతుల ఫిర్యాదు మేరకు పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి బుధవారం జోగిపాడు గ్రామం సందర్శించి బోడోబోందోను పరిశీలించారు. గతంలో ఈ చెరువు వల్ల వందల ఎకరాలకు ఖరీఫ్‌లో సాగునీరు అందించే సౌకర్యం కలిగించేదని రైతులు ఎమ్మెల్యేతో అన్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు మరోపక్క ప్రభుత్వ ఎత్తిపోతల శాఖ ఇంజినీర్లు మరమ్మతులు చేయకపోవడం వల్ల చెరువు ఎండిపోయిందన్నారు. సంబంధిత శాఖ అధికారులకు ఎమ్మెల్యే రూపేష్ ఫోన్‌చేసి మరమ్మతుల కోసం అడిగి తెలుసుకున్నారు. దీనికి లిఫ్టు ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు చెరువు పుణరుద్ధరణ పనులు త్వరితగతిన ప్రారంభిస్తామని చెప్పినట్టు ఎమ్మెల్యే తెలియజేశారు. గుమ్మాబ్లాక్ ఉపాధ్యక్షుడు ఎస్.శ్రీనివాసరావు, సర్పంచ్ ఎడంగా శోబోరో, గ్రామస్తులు పాల్గొన్నారు.


