● పీవీటీజీ గ్రామాలకు రూ.10.29 కోట్లతో గ్రామీణ రహదారులు
రాయగడ: జిల్లాలొని దుర్భేద్యమైన పీవీటీజీ (ప్రత్యేక బలహీన గిరిజన వర్గాలు ) ప్రాంతాలకు అన్ని కాలాల్లో రాకపొకలు సులభంగా ఉండేలా గ్రామీణ రహదారుల నిర్మాణానికి కీలక అడుగు పడింది. జిల్లా యంత్రాంగం చేపట్టిన ఆమ్ రస్తా–2025–26 పథకం కింద జిల్లా యంత్రాంగం, మహానది కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసిఎల్) మధ్య అవగాహన ఒప్పందం (ఎంఒయు ) కుదిరింది. ఈ మేరకు మునిగుడ సమితి గ్రామీణ రహదారుల నిర్మాణానికి ఎంసీఎల్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్) నిధుల నుంచి రూ.10.29 కోట్ల ఆర్థిక సాయం అందించనుంది. కలెక్టర్ అశుతొష్ కులకర్ణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంసీఎల్ సిఎస్‌ఆర్ జనరల్ మేనేజరు జ్మొతిర్మయి సిన్హా , జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ తొ పాటు పలువురు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా మునిగుడ సమితిలోని శిరిపదర్, మున్డొల్ గ్రామపంచాయతీల పరిధిలో రక్సర్‌పాడి, రకట, సుతానగుణి, బర్డబర్డా, గరాట, ముండా, త్రాహాలీ, సర్గిపాయి గ్రామాలకు చెందిన 564 మంది పీవీటీజీ ప్రజలు నేరుగా లబ్ధి పొందనున్నారు. ఆమ రస్తా–2025–26 పథకం ప్రధాన లక్ష్యం బిసంకటక్ ,గుణుపూర్, కళ్యాణసింగుపూర్, మునిగుడ సమితుల్లొ దూర ప్రాంత గిరిజన గ్రామాలకు మూడు మీటర్ల వెడల్పుతో అన్ని కాలాల్లో ఉపయోగించగల పక్కా రహదారులతొ ప్రధాన
రహదారి నెట్‌వర్క్ కు అనుసంధానం చేయడం. దీంతో అంబులెన్స్ సేవలు, వైద్య సదుపాయాలు, విద్యా, గ్రామీణ మార్కెట్లు, మొబైల్ నెట్‌వర్క్, పీఎం–జన్‌మన్ గృహాల నిర్మాణ సామగ్రి రవాణా వంటి సేవలు సులభంగా అందుబాటులోకి రానున్నాయి. మునిగుడ సమితికి సంబంధించిన డీపీఆర్ ప్రకారం 8 గ్రామీణ రహదారి ప్రాజెక్టులు అమలు చేయనున్నారు. వీటిలొ 10.36 కిలోమీటర్ల పక్కా రహదారులు, 24 కల్వర్టులు, 2980 మీటర్ల డ్రైనేజీ వ్యవస్థ నిర్మించారు. వర్షాకాలంలో కూడా రహదారులు దెబ్బ తినకుండా, వర్షపు నీటి పారుదల సక్రమంగా జరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.
జిల్లా యంత్రాంగం రూపొందించిన సమగ్ర ప్రణాళిక ప్రకారం బిసంకటక్‌లో 11, గుణుపూర్‌లో 10, కళ్యాణసింగుపూర్‌లో 16, మునిగుడలో 8 కలిపి మొత్తం 45 రహదారి ప్రాజెక్టులు ప్రతిపాదించారు. వీటి ద్వారా 82.82 కిలోమీటర్ల రహదారులు, 6958 మీటర్ల డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం ప్రాజెక్టుల అంచనా వ్యయం రు.56.34 కోట్లు కాగా మునిగుడ సమితికి సంబంఽధించి 8 ప్రాజెక్టుల కోసం రూ.10.29 కోట్లు కేటాయించారు. ఈ ఒప్పందంలో జిల్లా యంత్రాంగం, ఎంసీఎల్ సంయుక్తంగా పీవీటీజీ ప్రాంతాల్లొ నాణ్యమైన రహదారి మౌలిక సదుపాయాలు కల్పించి, ఆరోగ్యం, విద్య, ఉపాధి, మార్కెట్ అనుసంధానం వంటి రంగాల్లో సమగ్ర అభివృద్ధికి బాటలు వేయనున్నట్లు అధికారులు తెలిపారు.


