పర్లాకిమిడి: ఒడిశా శాసనసభ స్టాండింగ్ కమిటీ ఈనెల 29, 30న రెండు రోజుల పాటు తమిళనాడు రాష్ట్రం చైన్నె అధ్యయనం కోసం పర్యటించారు. పరిశ్రమలు, ఆరోగ్యం, పట్టణాభివృధ్ధితో పాటు చైన్నెలో నివసిస్తున్న గజపతి జిల్లా వాసులు, కూలీలు, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులతో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి మాట్లాడారు. తమిళనాడు శాసనసభ స్పీకర్ జె.సి.డి.ప్రభాకర్‌ను తొలుత ఒడిశా స్టాండింగ్ కమిటీ ప్రతినిధులు కలుసుకున్నారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్, ఇతర మంత్రులను కలిసి అక్కడ వివిధ అభివృద్ధి పథకాలు ఎలా అమలు జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఒడిశా శాసనసభా పక్షం స్టాండింగ్ కమిటీ చైర్మన్ బిభూతీ భూషన్ ప్రధాన్ అధ్యక్షతన ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, ఎమ్మెల్యే సత్యజిత్ గొమాంగో, ప్రశాంత బెహరా తదితరులు పర్యటనలో పాల్గొన్నారు. ఆగస్టు 1వ తేదీన ఒడిశా శాసనసభా పక్షం స్టాండింగ్ కమిటీ తెలంగాణాలో పర్యటించనున్నట్టు ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి తెలియజేశారు.
భట్టారిక ఆలయానికి వరద ముంపు
భువనేశ్వర్: కటక్ జిల్లాలోని నరసింహపూర్ బొడొంబాలో ఉన్న భట్టారిక ప్రధాన ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. భట్టారిక ఆలయం లోపల వరద నీరు నిలకడగా ప్రవహిస్తోంది. భట్టారిక అమ్మవారిని రత్నగిరి కొండపై ఉన్న సురక్షిత ప్రాంతానికి తరలించారు.
రాష్ట్రపతి పర్యటనకు భద్రత కట్టుదిట్టం
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి విచ్చేయనున్నారు. ఆమె పర్యటన ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు భద్రతా, లాజిస్టికల్ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కటక్ జిల్లా యంత్రాంగం రాష్ట్రపతి హాజరు కానున్న ప్రాంతాల పరిధిలో నో డ్రోన్ జోన్, నో ఫ్లయింగ్ జోన్ ఉత్తర్వులను జారీ చేసింది. డ్రోన్, యూఏవీ, పవర్డ్ పారాగ్లైడర్, మైక్రోలైట్ విమానాలు తదితర పరికరాలపై నిషేధం ఆగస్టు 1 నుంచి రాష్ట్రపతి పర్యటన ముగిసే వరకు నిరవధికంగా అమలులో ఉంటుందని కటక్ జిల్లా కలెక్టర్ దత్తాత్రేయ భావుసాహెబ్ షిండే వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే పరికరాలను స్వాధీనం చేసుకుని డ్రోన్ నియమాలు 2021 మరియు విమాన చట్టం, 1934 కింద జరిమానాలు విధించబడతాయని హెచ్చరించారు. బంకి సబ్ కలెక్టర్‌ను అమలు వ్యవహారాల నోడల్ అధికారిగా నియమించారు.
విద్యార్థులకు టెస్ట్ పేపర్ల
అందజేత
జయపురం: బొరిగుమ్మ సాయి గాయిత్రీ పరిబార్ విద్యార్థులకు సహాయం చేసేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గురువారం ప్రతిభావంతులైన విద్యార్థులకు టెస్ట్ పేపర్లు అందజేశారు. ఈ సందర్భంగా గాయిత్రి కుటుంబం సీనియర్ సభ్యులు లాలు సారంగి మాట్లాడుతూ గాయిత్రి కుటుంభం ద్వారా భవిష్యత్‌లో అనేక సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టనుందని అన్నారు. ఇల్లు లేని దివ్యాంగులకు ఇళ్లు కట్టి ఇచ్చే బృహత్ కార్యక్రమానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. సమాజ వికాసానికి విద్య పునాది అని, అందుకే విద్యా వికాసానికి తమ సంస్థ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. బొరిగుమ్మ సమితిలో 60 మంది విద్యార్థులకు ఉచితంగా టెస్ట్ పేపర్లు అందజేశామని వెల్లడించారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సహాయం చేస్తామని అన్నారు.


