రాయగడ: జిల్లాలోని మునిగుడ సమీపంలో కుముడాబల్లి గ్రామంలో ఉన్న శివాలయం వద్ద, అదేవిధంగా వంతెన సమీపంలోని వంశధార నదిలో భారీ మొసలి సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఒడియా వారి శ్రావణ మాసం కావడంతో శివాలయానికి పెద్ద సంఖ్యతో బోల్‌భమ్ భక్తులు, ఇతర భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నదిలో స్నానాలు చేయడం, నది ఒడ్డుకు వెళ్లడం, నీటిలో దిగడం వంటి చర్యల విషయంలో భక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచించారు. అటవీ శాఖ, స్థానిక అధికారులు ఈ విషయాన్ని గమనించి తగిన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు భక్తుల భద్రత కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


