భువనేశ్వర్: రాష్ట్రంలో నెలకొన్న వరద పరిస్థితిని అంచనా వేసేందుకు రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ కుమార్ పూజారి హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాల్ని సందర్శించారు. ఈ సందర్భంగా జాజ్‌పూర్, భద్రక్, బాలేశ్వర్ మరియు కెందుఝొర్ జిల్లాల్లోని వరద ప్రభావం, నీట మునిగిన పంటలు, జల దిగ్బంధంలో ప్రాంతాలను మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ వైమానిక పరిశీలనకు ముందు స్థానిక లోక్ సేవా భవన్‌లో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షపాతం, వరద పరిస్థితుల పర్యవేక్షణకు నియమితులైన సీనియర్ అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనుక్షణం మారుతున్న వరద పరిస్థితులు, ముందస్తు సన్నద్ధత మరియు సహాయక చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
24 గంటలు తాటిచెట్టుపైనే..
భువనేశ్వర్: వరద ముంపుతో భద్రక్ జిల్లా తల్లడిల్లుతోంది. ఈ పరిస్థితుల్లో ఒక రైతు వరద నీటి మధ్యలో చిక్కుకుపోయాడు. దాదాపు 24 గంటల పాటు నిద్ర, ఆహారాలు లేకుండా తాటి చెట్టుపై ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని గడిపాడు. ఒడిశా విపత్తు స్పందన రక్షణ దళం (ఒడ్రాఫ్) బృందం శుక్రవారం రైతుని రక్షించింది. ఈ సంఘటన భద్రక్ జిల్లా ధామ్‌నగర్ మండలం నందిగాంవ్ పంచాయతీ పరిధిలోని గుండిచా సాహి గ్రామంలో చోటు చేసుకుంది. త్రిలోచన్ సాహుగా గుర్తించబడిన బాధిత రైతు పొలం పనిలో నిమగ్నమై ఉండగా ఉప్పెనలా వరద ముంచెత్తింది. వేరే మార్గం లేక ప్రాణాలను కాపాడుకోవడానికి అతను చేరువలో ఉన్న ఒక పొడవైన తాటి చెట్టు ఎక్కాడు. బుధవారం ఉదయం సుమారు 10 గంటల నుండి గురువారం ఉదయం వరకు త్రిలోచన్ సాహు దాదాపు 24 గంటల పాటు ఆకలి, భయంతో పోరాడుతూ ఆ చెట్టుపైనే చిక్కుకు పోయాడు. అతనికి ఫోన్ చేసినా సమాచారం అందకపోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తన కుమారుడు సరోజ్ సాహు ధామ్‌నగర్ ఎమ్మెల్యే సూర్య వంశీ సూరజ్‌కు పరిస్థితి గురించి తెలియజేశాడు. మంత్రి చొరవతో ధామ్‌నగర్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఆధ్వర్యంలో 3 ఒడ్రాఫ్ బృందాలు రాత్రంతా విస్తృతంగా గాలించి గురువారం ఉదయం సుమారు 9 గంటలకు త్రిలోచన సాహును తాటి చెట్టు పైనుంచి విజయవంతంగా రక్షించారు. రక్షించిన రైతు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.


