రాయగడ:
జిల్లాలోని బిసంకటక్‌లో 25వ ఒడిశా రాష్ట్ర స్థాయి సీనియర్ సెపక్ తక్రా పోటీలు ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. సమితిలోని ఐఓబీ వెనుక ఉన్న క్రీడా మైదానంలో ఈ నెల రెండో తేదీ ప్రారంభమైన పోటీలు నాలుగో తేదీన ముగిశాయి. ముఖ్యఅతిథిగా బింసంకటక్ తహసీల్దార్ వెంకటేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. గౌరవ అతిథులుగా సమితి వైస్ చైర్‌పర్సన్ దేవీ ప్రసాద్ పట్నాయక్, నేత్రానంద సత్పతి పాల్గొన్నారు. రాయగడ జిల్లా సెపక్ టక్రాసంఘం, బిసంకటక్‌కు చెందిన నేతాజీ సోషల్ కల్చరల్ అండ్ స్పోర్టింగ్ క్లబ్ సంయుక్తంగా ఈ టోర్నమెంటును నిర్వహించాయి. రాష్ట్రంలోని రాయగడ, సందర్‌ఘడ్, భద్రక్, పుల్బాణి, కంధమాల్, కేందుఝర్ తదితర 17 జిల్లాల నుంచి 19 పురుషుల జట్లు, 12 మహిళల జట్లు పాల్గొన్నాయి.
రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి రిఫరీలతో నిర్వహణ..
రాష్ట్ర సెపక్ తక్రా సంఘం ప్రధాన కార్యదర్శి పృధ్వీరాజ్ సాహు ప్రత్యక్ష పర్యవేక్షణలో పోటీలు నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన రాష్ట్ర, జాతీయ ,అంతర్జాతీయ స్థాయి రిఫరీలు మ్యాచ్‌లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యాక్షుడు ప్రభాస్ శుభదర్శన్ మహాంతి, సుందర్‌ఘడ్ కార్యదర్శి సుశాంత్ కుమార్ షడంగి, కంధమాల్, జగత్సింగ్‌పూర్, భద్రక్ జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన పురుష, మహిళా క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీల కోసం ఎంపిక చేయనున్నారు. ఎంపికై న క్రీడాకారులకు రాయగడలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు అక్టోబరు 30 నుంచి నవంబరు 4 వరకు జరగనున్న జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీల్లో ఒడిశా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ సాహు తెలిపారు.


