147 ఏళ్ల రాగి శాసనం | - | Sakshi
Sakshi News home page

147 ఏళ్ల రాగి శాసనం

Oct 5 2026 1:09 AM | Updated on Oct 5 2026 1:09 AM

● బిసంకటక్‌ థాటారాజ రామచంద్రుడి భూదానానికి చారిత్రక సాక్ష్యం

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 5 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026
గుణుపూర్‌లో..

రాయగడ: చరిత్ర పుటల్లో మరుగునపడిన ఓ అరుదైన ఆధారం వెలుగులోకి వచ్చింది. రాయగడ జిల్లా చారిత్రక పట్టణమైన గుణుపూర్‌లోని బ్రాహ్మణవీధి ప్రాంతంలో సుమారు 147 ఏళ్ల నాటి అరుదైన ఒడియా రాగి శాసనం బయటపడింది. బిసంకటక్‌ ఽథాటారాజా కుటుంబ చరిత్ర, అప్పటి భూదాన విధానం, తాలూకా వ్యవస్థ, స్థానిక పరిపాలన తీరు తెన్నులను తెలుసుకునేందుకు ఈ శాసనం కీలక ఆధారంగా నిలిచే అవకాశం ఉందని చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. స్థానిక చరిత్ర పరిశోధకుడు అక్షయ కుమార్‌ దాస్‌, రామనగుడ తహసీల్దార్‌ డాక్టర్‌ ప్రాణకృష్ణ పాణిగ్రహి ప్రయత్నాలతో ఈ చారిత్రక రాగి ఫలకం గుణుపూర్‌లో స్థానిక రాజ పురొహిత కుటుంబంగా గుర్తింపు పొందిన బ్రహ్మ కుటుంబానికి చెందిన అశొక్‌ రథ్‌, హృషికేస్‌ రథ్‌ నివాసంలో గుర్తించారు. ఎన్నో ఏళ్లుగా కుటుంబ సభ్యుల వద్ద భద్రంగా ఉన్న ఈ రాగి ఫలకం, దానిపై ఉన్న లిపిని పరిశీలించి పఠించిన అనంతరం అసలు చారిత్రక ప్రాధాన్యం వెలుగులోకి వచ్చింది.

తొలిసారిగా శాసన పాఠం వెలికితీత

పర్లాకిమిడికి చెందిన యువ చరిత్రకారుడు, ప్రముఖ లిపిశాస్త్ర పరిశోధకుడు విష్ణు మోహన్‌ అధికారి ఈ అరుదైన రాగి శాసనంలోని వివరాలను తొలిసారిగా పఠించారు. లిపి, భాష, తేదీ, శాసనంలోని అంశాలపై ప్రాథమిక పరిశీలన అనంతరం దీని కాలం, చారిత్రక నేపథ్యంపై స్పష్టత ఏర్పడుతున్నట్లు ఆయన తెలిపారు. పరిశోధకుడి ప్రాథమిక అంచనా ప్రకారం ఈ రాగి ఫలకం 1879 అక్టోబరు 2 న, ఆశ్వయుజ శుక్ల త్రయోదశి , సొమవారం రోజున చెక్కినట్లు తెలుస్తోంది.

గదాధర్‌ రథ్‌ కు పితాంబర్‌ శాసన్‌ భూదానం

ప్రాథమిక పాఠోద్ధరణలో అభించిన వివరాల ప్రకారం, బిసంకటక్‌ థాటరాజా రామచంద్రుడు, గదాధర్‌ రథ్‌కు బిసంకటక్‌ తాలూకా పరిధిలోని పితాంబర్‌ శాసన్‌ భూమిని దానం చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పట్టా నిర్ణయ పత్రంగానే ఈ రాగి శాసనం ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ విషయం పూర్తిగా ధృవీకరిస్తే, 19వ శతాబ్దంలో బిసంకటక్‌ ప్రాంతంలో అమలులో ఉన్న భూదాన వ్యవస్థ, తాలూకా పరిపాలన, స్థానిక పాలనా విధానం, థాటారాజాల అధికారాలు, వారి పరిపాలనా పాత్రపై అధ్యయనం చేసేందుకు ఇది అత్యంత విలువైన ప్రాథమిక చారిత్రక ఆధారంగా నిలిచే అవకాశం ఉంది.

ఒడియాతో పాటు సంసృత శ్లోకాలు..

ఈ శాసనానికి మరొ ప్రత్యేకత దాని భాషా నిర్మాణం, రాగి ఫలకంపై ప్రధాన విషయాలను ఒడియా భాషలో చెక్కగా, వెను భాగంలో సంస్కృత శ్లోకాలు చెక్కినట్లు పరిశోధకులు గుర్తించారు. అప్పటి కాలంలో ఒడియా, సంస్కృత భాషలను పరిపాలనా, ధార్మిక అవసరాలకు ఎలా ఉపయోగించేవారొ తెలుసుకునేందుకు ఈ ద్విభాషా శాసనం కొత్త పరిశోధన అవకాశాలను అందిస్తుందని విష్ణు మోహన్‌ అధికారి తెలిపారు.

బిసంకటక్‌ కుటుంబానికి సంబంధించిన

తొలి సనదు

లిపిశాస్త్ర పరిశోధకుడు విష్ణుమోహన్‌ అధికారి అభిప్రాయం ప్రకారం, బిసంకటక్‌ థాటారాజా కుటుంబానికి సంబంధించిన తొలి సనదుగా ఈ రాగి ఫలకం పరిగణించే అవకాశం ఉంది. అదే నిజమైతే దీని చారిత్రక, శాసనపరమైన ప్రాధాన్యం మరింత పెరగనుంది.

మరిన్ని చారిత్రక రహస్యాలకు తెరలేపే అవకాశం

ఈ రాగి శాసనాన్ని పూర్తిగా పఠించడం, లిపిని శాసీ్త్రయంగా విశ్లేషించడం, వెనుక భాగంలోని సంస్కృత శ్లోకాల అర్థాన్ని వెలికితీయడం, అందులో పేర్కొన్న వ్యక్తులు, ప్రాంతాలు, భూములకు సంబంధించిన వివరాలను ఇతర చారిత్రక పత్రాలతో సరిపొల్చడం ద్వారా బిసంకటక్‌, గుణపూర్‌తో పాటు దక్షిణ ఒడిశా చరిత్రలోని అనేక తెలియని అధ్యాయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

8న భారత్‌ బంద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement