రాయగడ: గుణుపూర్‌లో వీధికుక్కల బెడద ఎక్కువైంది. ఇటీవల ఓ కుక్క స్వైర విహారం చేసి దాడి చేయడంతో 13 మంది గాయపడ్డారు. వారంతా సబ్ డివిజన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో జే కున్ని, జయంతి సబర్, సునేనా శతపతి, దయూరీ గమాంగ్, జిసాయి సబర్, అరుణ్ పాడి, బబితా పాలక, డి.ఉపేంద్ర, సదాం సబర్ తదితరులు ఉన్నారు. వీధి కుక్కను పట్టుకునేందుకు గుణుపూర్ మున్సిపాలిటీ అధికారులు చర్యలు ప్రారంభించారని ఈఓ సంతోష్ నాయక్ తెలిపారు.
బీజేడీ అధ్యక్షుని కుమారుడు
అనురూప్ నాయక్ ఆకస్మిక మృతి
పర్లాకిమిడి: గజపతి జిల్లా బీజేడీ పార్టీ అధ్యక్షుడు ప్రదీప్ నాయక్ రెండో కుమారుడు అనురూప్ నాయక్(18) సిపున్ ఆకస్మిక మరణంతో పర్లాకిమిడిలో విషాద ఛాయలు నెలకొన్నాయి. స్థానిక బట్టగౌడవీధికి చెందిన ప్రదీప్ నాయక్ చిన్న కుమారుడు అనురూప్ నాయక్ డీ ఫార్మా పూర్తిచేశాడు. కొడుకును ప్రయోజికుడిగా చేస్తానన్న తండ్రి కలలు కలగానే మిగిలిపోయాయి. శనివారం సాయంత్రం సిపున్ గుండెపోటుతో శ్రీకాకుళం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆదివారం పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, సహాచరులు లక్ష్మీకాంత పోరిచ్చా, రొక్కం సతీష్, పురపాలక సంఘం చైర్మన్‌నిర్మలా శెఠి, వి.సి. లెంక మధు, కౌన్సిలర్లు, ఇతరత్రా బంధువర్గం అంతా ప్రదీప్ నాయక్‌ను పరామర్శించారు. పాతపట్నం రోడ్డు శ్మశాన వాటిక వద్ద అశేష జనసందోహం మధ్య సిపున్ అంత్యక్రియలు పూర్తిచేశారు.
మూడు క్వింటాళ్ల గంజాయి పట్టివేత
మల్కన్‌గిరి : కలిమెల సమితి వెంకటపాలెం అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి మూడు క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు ఈ దాడులు చేయగా పోలీసుల రాక తెలిసి దుండగులు పరారయ్యారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కలిమెల ఐఐసీ ప్రభుదత్తు బిశ్వల, తహసీల్దార్ తెలిపారు.
‘జయపూర్‌పై సర్వత్రా నిర్లక్ష్యమే’
కొరాపుట్: జయపూర్ విధాన సభ నియోజకవర్గంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయని మాజీ మంత్రి,ప్రతి పక్ష బీజేడీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రబినారాయణ నందో ధ్వజమెత్తారు. ఆదివారం జయపూర్ పట్టణంలో హలో జయపూర్‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. గత కొంత కాలంగా నియోజకవవర్గ ప్రజలు ప్రభుత్వాల అణచివేతకి గురవుతున్నారని ధ్వజమెత్తారు. అవిభక్త కొరాపుట్ జిల్లాలో అతి పెద్ద పట్టణం జయపూర్‌కి అన్ని విధాలుగా అన్యాయం జరుగుతోందన్నారు. వేలాది కుటుంబాలు ఆధార పడిన జయపూర్ సేవా పేపర్ మిల్లు మూత పడిందన్నారు. దీంతో అనేక మంది కార్మికులు మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. తక్షణం మిల్లు తెరిపించడానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు.కొరాపుట్ నుంచి బ్రహ్మపుర వరకు 6 లైన్ల రోడ్డు నిర్మాణంలో కదలిక లేదన్నారు. బొరిగుమ్మతో పాటు పరిసర గ్రామాల ప్రజలు తీవ్రమైన తాగునీటి ఎద్దడితో బాధ పడుతున్నారని తెలిపారు. జయపూర్–హైదరాబాద్ మార్గంలో నడిచే ఓల్వో బస్సులను ఆపేయడం దారుణమన్నారు. కొరాపుట్–జయపూర్ ల మద్య టన్నెల్ నిర్మించి రహదారి ఏర్పాటు చేయాలని నిపుణులు సూచించారన్నారు. దాని వలన ఇరు పట్టణాల మద్య ప్రజలు రాక పోకలకు సులభంగా ఉంటుందన్నారు. కానీ ప్రభుత్వం ఈ కోణం లో చర్యలు తీసుకోలేదన్నారు.


