భువనేశ్వర్: పవిత్ర రథయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ పూరీలోని జగన్నాథ ఆలయ పరిపాలనా కార్యాలయంలో సమర్పణ్ అత్యాధునిక డిజిటల్ హుండీని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులను జగన్నాథునితో అనుసంధానించే కీలక చర్యల్లో భాగంగా దీనిని పేర్కొన్నారు. పూర్తి భద్రత, పారదర్శకతతో విరాళాలు అందించడానికి వీలుగా ఈ సురక్షిత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను అధికారిక ఎస్‌జేటీఏ పోర్టల్‌తో అనుసంధానించారు. ఈ వ్యవస్థ ద్వారా సేకరించిన విరాళాల డబ్బును ఆలయ అభివృద్ధి, నిర్వహణకు వినియోగిస్తామని సీఎం తెలిపారు. డిజిటల్ హుండీ – సమర్పణ్ కేవలం సాంకేతికత ఆధారిత ఆవిష్కరణ మాత్రమే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న కోట్లాది జగన్నాథ భక్తుల భక్తిని ఆలయంతో అనుసంధానించే ఒక పవిత్రమైన, స్వచ్ఛమైన వారధి అని పేర్కొన్నారు. మహా ప్రభువు జగన్నాథుని సంప్రదాయాన్ని పరిరక్షణ, ఆలయ సమగ్ర అభివృద్ధిలో ఈ చొరవ ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. దీనికోసం ఒక ప్రత్యేక వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ అభివృద్ధి చేశారు. యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డులు, వాట్సాప్ ద్వారా విరాళాలు అందించేందుకు వీలవుతుంది. భక్తులు రూ.1 మొదలుకొని అపరిమితంగా విరాళం ఇవ్వవచ్చు. దాతలు విరాళం చెల్లింపు చేసిన వెంటనే వారి డిజిటల్ రశీదును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విరాళాలు ఆదాయపు పన్ను మినహాయింపునకు అర్హమైనవిగా ప్రకటించారు. ఈ యాప్ పూరీని సందర్శించే యాత్రికుల కోసం ఆలయ సమాచారం, రోజువారీ పూజల ప్రకటనలు, తాజా సమాచారం, భక్త నివాస్ అతిథి గదులను బుక్ చేసుకునే సౌకర్యాన్ని కూడా అందిస్తుంది.


