రాయగడ: తాము పోలీసులమని చెప్పి ఒకరి ఇంట్లో దౌర్జన్యంగా చొరబడి 4.75 లక్షల రూపాయల నగదు దొంగిలించిన కేసులో ముగ్గురు నిందితులను గుణుపూర్ ఆదర్శ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తులు రామనగుడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొడొగుడ గ్రామానికి చెందిన డుబులా పతిక, లవుగుడ గ్రామానికి చెందిన తన్మయ్ పతిక, సులిడి గ్రామానికి చెందిన సండా సబర్‌లు ఉన్నారు. బుధవారం నిందితులను కోర్టుకు తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. ఈ నెల ఎనిమిదో తేదీన రామనగుడ సమితి గురుండ పంచాయతీలొని లగుడిగుడ గ్రామంలో నివసిస్తున్న తమన హుయిక ఇంటిలోకి పోలీసుల మని పరిచయం చేసుకుని ఆరుగురు గుర్తు తెలియని దుండగులు దౌర్జన్యంగా చొరబడ్డారు. గంజాయి వ్యాపారం చేస్తున్నారని బెదిరించి ఇంటి యజమానిని బెదిరించారు. అనంతరం ఇంటిలోని అలమెరను తెరవమని అందులో ఉన్న 4.75 లక్షల రూపాయల నగదును దోచుకుని పరారయ్యారు. ఈ విషయమై బాధితుడు ఈ నెల పదో తేదీన గుణుపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ మేరకు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 54 వేలు స్వాధీనం చేసుకున్నారు.
పర్లాకిమిడి రైల్వేస్టేషన్ ప్రారంభం రేపు
పర్లాకిమిడి: అమృత్ భారత్ యోజనలో భాగంగా దేశంలో అనేక రైల్వేస్టేషన్లు అప్‌గ్రేడ్ అవుతున్న సమయంలో పర్లాకిమిడి రైల్వేస్టేషన్‌కు మహర్దశ పట్టింది. ఈనెల 17వ తేదీన రాయగడ రైల్వే డివిజన్ డీఆర్‌ఎం అబిమాత్ సింఘాల్ లాంఛనంగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు స్టేషన్‌లో షామియానాలు, డెకరేషన్ పనులు జరుగుతున్నాయి. అయితే నౌపడ–పర్లాకిమిడి–గుణుపురం రైల్వేస్టేషన్ అప్పటి గజపతి మహారాజా గౌరచంద్రగజపతి, కుమారుడు శ్రీక్రిష్ణచంద్రగజపతి నారాయణదేవ్ తోలుత స్టీమ్ ఇంజిన్ బ్రిటీషు కాలంలో ప్రవేశపెట్టారు. రెండేళ్ల క్రితం లోకసభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా పర్లాకిమిడి రైల్వేస్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో రైెల్వే సహాయమంత్రి పర్లాకిమిడి మహారాజా గజపతి విగ్రహాన్ని స్టేషన్ ఆవరణలో నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. దీనిపై పర్లాకిమిడి సీనియర్ సిటిజన్, మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు ఇతర న్యాయవాదులు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖలు రాశారు. అయితే ప్రస్తుతానికి ప్రారంభోత్సవ సమయంలో మహారాజా క్రిష్ణచంద్రగజపతి ప్రతిమూర్తి లేకపోవడంతో స్థానికులు, న్యాయవాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ తహసీల్ పరిధిలోని సిరిజులి సర్కిల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) సుశాంత్ మల్లిక్‌ను 25 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా రాష్ట్ర విజిలెన్స్ అధికారులు బుధవారం రెడ్ హ్యాండడ్‌గా పట్టుకున్నారు. వారసత్వ భూమికి సంబంధించిన మ్యూటేసన్ కేసులో అనుకూల విచారణ నివేదిక సమర్పించి, ఆర్‌వోఆర్ (భూపట్టా) జారీ చేయడానికి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అధికారులు ఉచ్చుపన్ని అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లొకి వెళితే.. ఫిర్యాదుదారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, అవసరమైన ఫీజులు చెల్లించినప్పటికీ, ఎలాంటి కారణం లేకుండా దరఖాస్తును పెండింగ్‌లో ఉంచిన ఆర్‌ఐ సుశాంత్ మల్లిక్ రూ. 25 వేలు లంచం కొరినట్లు తెలిసింది. దీంతో బాధితుడు విజిలెన్స్ అధికారులను ఆశ్రయించగా వారి ప్రణాళిక ప్రకారం బుధవారం తన కార్యాలయంలో లంచం స్వీకరిస్తుండగా అధికారులు రెడ్ హ్యాండడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ. 25 వేలు లంచం నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆదాయానికి మించిన ఆస్తుల (డీఏ) కోణంలో సుశాంత్ మల్లిక్‌కు సంబంధించిన మూడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై కొరాపుట్ విజిలెన్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది.


