శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని మత్స్యకార కార్యాలయంలో గుర్తు తెలియని మృతదేహం సోమవారం బయటపడిన విషయం తెలిసిందే. మృతుడు పార్వతీపురం–మన్యం జిల్లా పాలకొండ మండలం వడమకు చెందిన తాపీ మేసీ్త్ర బొద్దాన సింహాద్రి (48)గా పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేకపోవడంతో శ్రీకాకుళంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మొబైల్ విడిచిపెట్టి ఈ నెల 8న బయటకొచ్చిన సింహాద్రి నగరంలోని మత్స్యశాఖ కార్యాలయంలోని ఓ పాడుబడిన గదిలో తలదాచుకున్నాడు. నిద్రాహారాలు లేక మృతిచెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మంగళవారం కుటుంబసభ్యులు వచ్చి గుర్తించారు. సింహాద్రికి ఇద్దరు భార్యలు. వీరిలో మొదటి భార్య సరస్వతి అంగన్‌వాడీ కార్యకర్త, రెండో భార్య ఆరుద్ర గృహిణి. ఈ ఘటనపై రెండో పట్టణ ఎస్‌ఐ బి.హైమావతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


