తొలి నిజ రూప దర్శనం | - | Sakshi
Sakshi News home page

తొలి నిజ రూప దర్శనం

Jul 15 2026 12:23 AM | Updated on Jul 15 2026 12:23 AM

నేడు దర్శనం మూత

భువనేశ్వర్‌: పవిత్ర ఆషాఢ శుక్ల పక్ష ప్రతిపాద తిథి పురస్కరించుకుని మంగళవారం పూరీ శ్రీ మందిరంలో శ్రీ జగన్నాథుని నిజ రూప దర్శనం భక్తులు, యాత్రికులకు లభించింది. స్నాన యాత్ర వెంబడి 15 రోజుల విరామం తర్వాత ప్రధాన దేవతలు నవ యవ్వన అలంకరణలో భక్తులకు తొలి దర్శనం ప్రసాదించారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత యాత్రలో భాగంగా సర్వ జనుల మధ్య జగతి నాథుడు సరికొత్త అలంకరణతో నవ యవ్వనునిగా ప్రత్యక్షం కానున్నాడు. అంతకు ముందుగా శ్రీ మందిరంలో దర్శనం ప్రసాదించడంపట్ల భక్తజనం పులకించి పోయారు. ఒనొసొరొ చతుర్దశి, ఆషాఢ అమావాస్య తిథి నాడు ఆలయ సంప్రదాయ నియమాల ప్రకారం దత్త మహా పాత్రో శ్రీ విగ్రహాల శ్రీ ముఖాలకు వన్నె దిద్ది నవ యవ్వన అలంకారానికి సర్వం సిద్ధం చేశారు.

చిత్ర పటాల దేవుళ్ల తొలగింపు

పవిత్ర ఆషాఢ శుక్ల పక్ష ప్రతిపద తిథి సందర్భంగా మంగళ వారం ఉదయం మంగళ హారతి, దైనందిన, నిత్య అలంకరణ కార్యక్రమాలు ముగించి దశావతార దేవతలలో శ్రీ బలభద్రుని ఆవరణలో నృసింహ, రామ, కృష్ణులను, శ్రీ జగన్నాథుని ఆవరణలో డోల గోవింద, శ్రీ మదననమోహనులను దక్షిణ గృహానికి తరలించారు. దేవీ సుభద్ర ఆవరణలో పూజలందుకున్న శ్రీ దేవి, భూ దేవి ఉత్సవ మూర్తులను శయన మండపానికి తరలించారు. ఆ తర్వాత మూల విరాటులు తెరు మరుగు కావడంతో దర్శనం కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పొట్టా చిత్ర దేవుళ్లు శ్రీ బలభద్రుని ప్రతినిధి వాసు దేవుడి ఆవరణలో, దేవీ సుభద్ర ప్రతినిథి భువనేశ్వరి, శ్రీ జగన్నాథుని ప్రతినిథి నారాయణుడి పటాలను శ్రీ మందిరం సముదాయంలో నెలకొని ఉన్న విమలా మాత పీఠం సమీపంలో మండుణి గృహానికి తరలించారు.

ఇలా ఒణొసొరొ ప్రాంగణంలో దేవతా సామగ్రి తొలగించడంతో కొఠొ సుంవాసియా వర్గం సేవకులు లోపలికి ప్రవేశించి ఒణొసొరొ తెరలు తొలగించారు. ఆ ప్రాంగణం జల సింఛనంతో శుద్ధి చేసి మూల విరాటుల సర్వ దర్శనానికి అనుమతించారు. అమావాస్య రాత్రి మూడు ఘడియలు ముగియడంతో ఆచార్య స్నానం అనంతరం పొట్టా చిత్రాల దేవుళ్ళ విసర్జనకు శ్రీకారం చుట్టడం ఆచారం. ఇదంతా పొద్దు పోయేంత వరకు నిరవధికంగా కొనసాగుతుంది. ఇదే క్రమంలో శ్రీ మందిరం సింహ ద్వారం ఆవరణలో కొలువై ఉన్న కుడ్య ప్రతిమ పతిత పావనుని సన్నిధిలో కూడ పొట్టా చిత్రం ఏర్పాటు తొలగించారు. వేకువ జాము నుంచి శ్రీ జగన్నాథుని నవ యవ్వన అలంకార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేయడంతో సుదీర్ఘ 15 రోజుల తర్వాత భక్తజనం స్వామిని కనులారా తిలకించి తన్మయం పొందారు.

పరిమిత దర్శనం

శ్రీ మందిరంలో నవ యవ్వన శోభలో శ్రీ జగన్నాథుని దర్శించేందుకు విశేష సంఖ్యలో యాత్రికులు తరలి వచ్చారు. శ్రీ క్షేత్రం కిటకిటలాడింది. ముందస్తు ప్రకటనం ప్రకారం యాత్ర సన్నాహాల నేపథ్యంలో నవ యవ్వన దర్శనం నిడివి పరిమితం చేశారు. పరమాణిక్‌ (ఆర్జితం) దర్శనం సాయంత్రం 5 గంటలకు ప్రారంభించి నామ మాత్రంగా అరగంటకు పరిమితం చేసి 5.30 గంటలకు ముగించారు. వెంబడి సర్వ దర్శనానికి అనుమతించారు. సాయంత్రం 7.15 గంటల వరకు భక్తులకు ఈ దర్శన సౌకర్యం కల్పించారు. లోపలి ఆవరణ నుంచి దేవతా మూర్తులకు దర్శనం చేసుకునేందుకు అనుమతించారు.

బుధవారం ఉభా యాత్ర కారణంగా శ్రీ మందిరంలో సర్వ దర్శనం మూసివేస్తామని ప్రకటించారు. మహా ప్రసాదం కోసం భక్తులు శ్రీ మందిరం ఉత్తర ద్వారం గుండా ప్రవేశించాల్సి ఉంటుందని తెలిపారు. భక్తులు తిరిగి అదే ద్వారం గుండా నిష్క్రమించాలని శ్రీ మందిరం ప్రధాన నిర్వాహకుడు డాక్టరు అరవింద్‌ కుమార్‌ పాఢి ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement