భువనేశ్వర్: ప్రఖ్యాత ఒడియా గాయకుడు సౌరవ్ భరద్వాజ్‌కు రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరి బాబు కంభంపాటి శుభాకాంక్షలు తెలిపారు. సౌరవ్ భరద్వాజ్ లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. జగన్నాథ స్వామిపై భక్తితో కూడిన ఆయన సంగీత ప్రయాణం ఎంతోమంది శ్రోతల ఆదరణను పొందింది. ఆయనకు మరిన్ని విజయాలు లభించి ఒడిశా యొక్క సుసంపన్నమైన సంగీత సంప్రదాయాన్ని సుదీర్ఘ కాలం పరిపుష్టం చేయాలని గవర్నర్ ఆకాంక్షించారు.
మలేరియాతో ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి
రాయగడ: జిల్లాలో మలేరియా వ్యాధి బారినపడి మరో విద్యార్థి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సదరు సమితి పరిధిలోని వత్తాడ ప్రభుత్వ ఉన్నత ఆశ్రమం పాఠశాలలో చదువుతున్న నాలుగో తరగతి విద్యార్థి జయసేన్ కండగిరి (9) మలేరియా వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బడకొసాపాడు గ్రామానికి చెందిన జయసేన్ గత నెల 27వ తేదీన జ్వరంతో బాధపడగా రక్తపరీక్షల్లో మలేరియా నిర్ధారణ అయ్యింది. తొలుత జిమిడిపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే మలేరియా మెదడుకు వ్యాపించడంతో (సెరెబ్రల్ మలేరియా) మెరుగైన చికిత్స కోసం బరంపురం ఎంకేసీజీ వైద్య కళాశాల ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచాడు. విద్యార్థి మృతదేహాన్ని ఆంబులెన్స్‌లో స్వగ్రామమైన బడకొసాపాడుకు తరలిస్తున్నారు. ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎటువంటి ఆధికారిక ప్రకటన వెలువడలేదు.
జూలై 18 వరకు చేపల వేట నివారణ
భువనేశ్వర్: సముద్రంలో అలజడి వాతావరణం అలముకుంది. రాగల 5 రోజుల్లో పరిస్థితులు మరింత క్షీణించే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రం ముందస్తు సమాచారం జారీ చేసింది. ఒడిశా తీరంలోని మత్స్యకారులు సముద్రం లోనికి వెళ్ళ వద్దని ఐఎండీ తాజా హెచ్చరిక జారీ చేసింది. ఈ సమాచారం ప్రకారం మంగళవారం నుంచి ఈ నెల 18 వరకు ఒడిశా తీరం వెంబడి, పరిసరాల్లో ఈదురు గాలులతో కూడిన వాతావరణం తాండవించే అవకాశం ఉంది. ఈ వ్యవధిలో గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వరకు పుంజుకుని గరిష్టంగా గంటకు 60 కిలో మీటర్ల వేగంతో గాలులు బలంగా వీచే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలుల కారణంగా ఈ 5 రోజుల పాటు ఒడిశా తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా లేదా అత్యంత అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉంది. ప్రతికూల వాతావరణం దృష్ట్యా ఈ నెల 14 నుండి 18 వరకు సముద్రంలోకి వెళ్లవద్దని ఐఎమ్‌డి రాష్ట్ర తీర ప్రాంత మత్స్యకారులకు సూచించింది. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు వీలైనంత త్వరగా ఒడ్డుకు తిరిగి రావాలని కోరింది. తీరప్రాంత నివాసితులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ తెలిపింది. ముందు జాగ్రత్త చర్యల కోసం ఈ హెచ్చరికను అన్ని తీరప్రాంత జిల్లాల పరిపాలనా యంత్రాంగాలకు తెలియజేశారు.
అక్రమాస్తుల కేసులో మాజీ జూనియర్ ఇంజినీర్‌కు మూడేళ్ల జైలు
రాయగడ: అక్రమాస్తుల కేసులో రాయగడ జిల్లా గుణుపూర్ సహాయ మట్టి సంరక్షణ కార్యాలయం మాజీ జూనియర్ ఇంజినీర్ (జేఈ) అశోక్ కుమార్ పాడికి కోర్టు మూడేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు లక్ష జరిమానా విధించింది. ఒడిశా విజిలెన్స్ నమోదు చేసిన కేసులో దర్యాప్తు అనంతరం అశోక్ కుమార్ పాడిపై అవినీతి నిరోధక చట్టం కింద అభియోగపత్రం దాఖలు చేసింది. తను చట్టబద్ధఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. ఈ కేసును విచారించిన బరంపురం విజిలెన్స్ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం అశోక్ పాడిని దోషిగా నిర్ధారించింది. ఈ మేరకు అతడికి మూడేళ్ల సాధారణ కారాగార శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. అశోక్ ప్రస్తుతం పదవీ విరమణ చేసినప్పటికీ కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయనకు అందుతున్న పెన్షన్‌ను నిలిపివేయాలని సంబఽంధిత శాఖ అధికారులకు విజిలెన్స్ కోరినట్లు వెల్లడించింది.


