భువనేశ్వర్: ప్రపంచ ప్రసిద్ధ రథయాత్ర సందర్భంగా ఈ ఏడాది కూడా హైటెక్ వైద్య కళాశాల అత్యవసర, తాత్కాలిక ఆస్పత్రిని ప్రారంభించింది. శ్రీ మందిరం ఉత్తర ద్వారం సమీపంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రిలో హెచ్‌డీయూ సౌకర్యాలతో 25 పడకలు ఏర్పాటు చేశారు. అనుభవజ్ఞులైన, సీనియర్ వైద్యులు రాత్రింబవళ్లు ఆరోగ్య సంరక్షణను అందిస్తారు. ప్రాథమిక చికిత్స తర్వాత తీవ్రమైన రోగులను భువనేశ్వర్‌లోని హైటెక్ ఆసుపత్రికి తరలిస్తారు. అంబులెన్స్ సైతం అందుబాటులో ఉంది. కంటి, దంత చికిత్స కోసం మొబైల్ వ్యాన్ అదనంగా ఏర్పాటు చేశారు. గత సంవత్సరం రథయాత్ర సందర్భంగా 12,335 మంది రోగులకు చికిత్స అందించారు. శ్రీ మందిరం ఉత్తర ద్వార్ వద్ద జరిగిన అత్యవసర ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి పూరీ లోక్‌సభ సభ్యుడు డాక్టరు సంబిత్ పాత్రో, సెంట్రల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ డాక్టర్ సత్యజిత్ నాయక్, హైటెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి, సత్యబాది నియోజకవర్గ ఎమ్మెల్యే ఓం ప్రకాష్ మిశ్రా, రాధా వల్లభ మఠం మహంత్ రామకృష్ణ దాస్ మహారాజ్, ఉత్తర పార్శ్వ మఠం మఠాధిపతి నారాయణ్ రామానుజ్ దాష్, శ్రీ మందిరం పాలక మండలి సభ్యులు, సీనియర్ సిబ్బంది హాజరయ్యారు. ఆరోగ్య సేవలను నిబద్ధతగా భావించి, మహాప్రభువు ఆశీస్సులతో ఈ పనిని కొనసాగిస్తామని హైటెక్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తిరుపతి పాణిగ్రాహి తెలిపారు.


