రాయగడ: స్థానిక జిల్లా పరిషత్ పరిధిలోని జిల్లా పట్టణాభివృద్ధి సంస్థలో ఆర్థిక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు పది లక్షల రూపాయలకు పైగా ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైనట్లు ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో డుడాలొ మేనేజ్‌మెంట్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్) స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్న వినయ్ హరిజన్ నిధులను తన వ్యక్తిగత ఖాతాకు బదిలీ చేసి పరారైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత శుక్రవారం నుంచి వినయ్ పరిజన్ కార్యాలయానికి హాజరు కాకపోగా, గత మూడు రోజులుగా ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. సొమవారం నాడు కూడా కార్యాలయానికి తాళం వేసి ఉండగా, టీమ్ లీడర్ సందీప్‌తో పాటు ఇతర ఉద్యోగులు కార్యాలయం బయట వేచి ఉండటం కనిపించింది. అయితే ఈ వ్యవహారంపై వారు మీడియా ముందు మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ ఘటనపై బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ స్పందిస్తు నిధుల లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. ఈ ఘటనపై విభాగ దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు చేయలేదని దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం సుమారు పది లక్షల రూపాయల ప్రభుత్వ నిధులను వినయ్ హరిజన్ తన వ్యక్తిగత ఖాతాకు బదిలీ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆయన డూడా పరిధిలో వీధి ద్వీపాలు, ఎల్‌ఈడి టీవీల నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ వాహనాల ఇంధనం, ఉద్యోగుల వేతనాలు తదితర ఖర్చుల పేరుతో కూడా నిధులు దుర్వినియోగం జరిగి ఉండవచ్చని అధికారులను అనుమానిస్తున్నారు. అయితే మొత్తం ఎంత మేర నిధుల గోల్‌మాల్ జరిగిందన్న దర్యాప్తు పూర్తయిన తరువాతే స్పష్టమవుతుందని అధికారులు తెలిపారు. దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలితే వినయ్ హరిజన్‌పై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అక్షయ్ కుమార్ ఖెముండొ స్పష్టం చేశారు.


