నందిగాం: మండల కేంద్రం నందిగాంలో విద్యుత్ స్తంభాన్ని వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది. జాతీయ రఽహదారి నుంచి బీసీ కాలనీ మీదుగా నందిగాం వచ్చే మార్గంలో అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఉన్న విద్యుత్ స్తంభాన్ని శ్రీకాకుళం నుంచి పెంటూరు కర్రల లోడ్‌తో వెళ్తున్న వ్యాన్ ఆటోను తప్పించబోయి ఢీకొట్టింది. ఈ ఘటనలో స్తంభం విరిగిపోయి కళ్లాల వైపు వాలిపోయింది. అదే రోడ్డు వైపు ఒరిగి ఉంటే పెను ప్రమాదం జరిగేది. గమనించిన స్థానికులు విద్యుత్ కార్యాలయానికి ఫోన్ చేసి సరఫరాను నిలిపివేయించారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులు వచ్చి సరఫరాను పునరుద్ధరించారు.
ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమ పరిశీలన
టెక్కలి రూరల్: రావివలలోని ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమను మంగళవారం టెక్కలి డీఎల్‌డీఓ అలివేలు మంగమ్మ పరిశీలించారు. పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యంతో సమీప ప్రాంత ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, పంటలు నాశనం అవుతున్నాయని, మూగజీవాలకు వింత వ్యాధులు వస్తున్నాయని కొందరు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో క్షేత్రస్థాయిలో పకరిశీలించి ఆరా తీశారు. ఆమెతో పాటు ఎంపీడీఓ ఎం.రేణుక, డిప్యూటీ ఎంపీడీఓ కె.సింహాద్రి తదితరులు ఉన్నారు.
ఇంటింటి సర్వే గడువు
24 వరకు పొడిగింపు
శ్రీకాకుళం పాతబస్టాండ్: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం బూత్ స్థాయి అధికారుల ఇంటింటి సర్వే గడువును జూన్ 15 నుంచి జూలై 24 వరకు పొడిగించామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం ఆయన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలసి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి, సవరించిన ప్రత్యేక సంక్షిప్త సవరణ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను జూలై 24 లోగా పూర్తి చేయాలని, జూలై 31న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణ జరుగుతుందని పేర్కొన్నారు. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణకు అవకాశం ఉంటుందని, సెప్టెంబర్ 28 లోగా వాటి పరిష్కారాన్ని పూర్తి చేసి, అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురిస్తామని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,358 పోలింగ్ కేంద్రాల పరిధిలో 18,97,405 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 17,30,748 ఓటర్ల దరఖాస్తుల (91.22 శాతం) కంప్యూటరీకరణ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని వెల్లడించారు. ఇంకా అనుసంధానం కావా ల్సిన 79,396 మంది ఓటర్ల ప్రక్రియను, మిగిలిన ఇతర సాంకేతిక లోపాలను యుద్ధప్రాతిపదికన సవరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు రౌతు శంకరరావు (వైఎస్సార్ సీపీ), పీఎంజే బాబు (టీడీపీ), పి.సురేష్ సింగ్ (బీజేపీ), ఐటీ.కుమార్ (వైఎస్సార్ సీపీ), ఎస్. సత్యనారాయణ (వైఎస్సార్ సీపీ), ఈశ్వరి (కాంగ్రెస్) తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న
ఐటీఐ కౌన్సెలింగ్
ఎచ్చెర్ల : ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారం కూడా కొనసాగించారు. 657 సీట్లకు గాను 285 మంది హాజరయ్యారు. వీరిలో 162 సీట్లను అభ్యర్థులకు కేటాయించారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల ఐటీఐ ప్రిన్సిపాల్ ఎల్.సుధాకర్, చిట్టి నాగభూషణరావు, సిబ్బంది పాల్గొన్నారు.


