రాయగడ: జిల్లాలోని గుడారి అటవీ శాఖ పరిధిలో రేంజర్‌గా విధులు నిర్వహిస్తున్న సుకుమార్ దుఖును విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. అతని నుంచి రూ.2.33 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫారెస్ట్ రేంజర్‌గా గుడారిలో విధులు నిర్వహిస్తున్న సుకుమార్ ఆదివారం ఒక బొలేరొలొ గుడారి నుంచి నవరంగపూర్‌లొ గల సేనాపతి వీధికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో సమాచారం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు నవరంగపూర్ జిల్లా పరిధిలోని ఇంద్రావతి బ్రిడ్జిపై అతడిని పట్టుకున్నారు. అనంతరం బొలేరొలో తనిఖీ చేయగా అందులో రూ.2.33 లక్షలు దొరికాయి. ఈ నగదుకు సంబంధించి సరైన సమాధానం చెప్పలేకపోవడంతో రేంజర్ సుకుమార్ ప్రయాణించే బొలేరొతొ సహా అతడిని విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు.
పారాదీప్‌లో చేపల మృతి
భువనేశ్వర్: పారాదీప్‌లోని కపిలఝొరొ వాగులో చేపలు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. చేపలు చనిపోయి నీటిపై గుట్టలు గుట్టలుగా తేలుతున్నాయి. దీనికి కారణం అస్పష్టంగా ఉంది. పారిశ్రామిక రసాయనాలు వాగులోకి చేరడం వల్లే చేపలు చనిపోతున్నాయని భావిస్తున్నారు.
మల్కన్‌గిరి మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ రాజ్వంత్‌కౌర్ మృతి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి మున్సిపాలిటీ మాజీ చైర్‌పర్సన్ రాజ్వంత్ కౌర్ ఆదివారం వేకువజామున 4.10 గంటలకు తన నివాసంలో కన్నుమూశారు. ప్రజల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని మధ్యాహ్నం 2.30 గంటల వరకు దుర్గాగుడి సాహి ప్రాంతంలోని నివాసంలో ఉంచారు.
వసతి గృహంలో
ఒడియా దివస్ వేడుకలు
మల్కనగిరి: ఒడియా పక్షోత్సవ వేడుకలను జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అధికారులు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతిని ప్రొత్సాహించేందుకు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా విద్యాశాఖ అఽధికారి చిత్తరంజన్ పాణిగ్రహి, విద్యాశాఖ తరఫున బూటిగుడలోని నేతాజీ సుభాష్‌బోస్ వసతి గృహంలో ఒడియా దివస్‌ను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ఒడియా పుస్తకాలు, మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు జిల్లా విద్యా అధికారి మంలతా భొయి, భాగీరధి బెహర హాజరై విద్యార్థులతో కొంతసేపు గడిపి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు కూడా ఒడియా పుస్తకాలు పంపిణీ చేశారు. బుడాగుటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పూర్ణ చంద్ర ఖండపాణి, సమగ్ర విక్షా యోజన సమన్వయకర్త విజయలక్ష్మీ చౌదరి పాల్గొన్నారు.


