విజయనగరం టౌన్: నగరంలోని కొత్తపేట కుమ్మరివీధిలో కొలువుదీరిన ముత్యాలమ్మ, పోతురాజుస్వామి వార్షిక తీర్థం ఈ నెల 8వ తేదీ నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఫౌండర్ ట్రస్టీ మద్దాల ముత్యాల ప్రకాశరావు, ఉత్సవ కమిటీ నిర్వహకులు మద్దాల రామకృష్ణారావు, మద్దాల నాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదిటి రోజు ఉదయం అమ్మవారికి నేత్రోత్సవం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
అభినందనలు
నెల్లిమర్ల: షటిల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీల్లో నెల్లిమర్ల క్రీడాకారుడు ప్రతిభ కనబర్చాడు. విజయనగరం డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియంలో ఇటీవల నాలుగు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలలో నెల్లిమర్లకు చెందిన క్రీడాకారుడు పైడిరాజు విజయకేతనం ఎగురవేశారు. 50+ విభాగంలో సింగిల్స్‌లో మంచి ఆటతీరు కనబరిచి రన్నర్‌గా నిలిచారు. అలాగే డబుల్స్ విభాగంలో కాకినాడకు చెందిన కేవీ సత్యనారాయణతో కలిసి విజేతగా నిలిచారు. దీంతో ఈ నెల 18 నుంచి 25 వరకు గోవాలో జరగనున్న ఆల్ ఇండియా మాస్టర్స్ నేషనల్ టోర్నమెంట్‌కు వీరిని రాష్ట్ర అసోసియేషన్ ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో పైడిరాజును నెల్లిమర్ల షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ బుధవారం ప్రత్యేకంగా అభినందించింది. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వీఎంకే లక్ష్మణరావు, కోశాధికారి శేఖర్, కోట్ల రంగారావు, రామారావు, సురేష్ పాల్గొన్నారు.
బాధ్యతగా మెలగాలి
విజయనగరం అర్బన్: సమస్యల పరిష్కారానికి యూనియన్లు బాధ్యతగా మెలగాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ) రాష్ట్ర అధ్యక్షుడు వై.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి పీవీ రమణారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ మినిస్టీరియల్ సిబ్బంది సంఘ సమావేశ మందిరంలో ఎన్‌ఎంయూ విజయనగరం జోన్ కార్యకర్తలకు నాయకత్వ లక్షణాలపై నిర్వహించనున్న రెండు రోజుల శిక్షణ తరగతులు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం, మేనేజ్‌మెంట్ ద్వారా అందుతున్న ప్రయోజనాలు, ఉద్యోగ భద్రత కల్పనలో నాయకుల పాత్రపై వివరించారు. ప్రముఖ సైకాలజిస్ట్ ఉమారాజ్ మాట్లాడుతూ.. విధుల్లో ఎదురయ్యే ఒత్తిళ్లను తట్టుకొని విజయం వైపు అడుగులేయాలని సూచించారు. హెచ్‌ఆర్ ఫ్యాకల్టీ మెంబర్ పీవీ భోగారావు మాట్లాడుతూ.. నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడంపై వివరించారు. అనంతరం అతిథులను సత్కరించారు. కార్యక్రమంలో సంఘం జోనల్ కార్యదర్శి బి.సూర్యరాములు, జిల్లా కార్యదర్శి పీజీ రాఫిల్, వివిధ డిపో కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


