● స్వతంత్ర అభ్యర్థిగా దిలీప్ రే
● గెలుపు మాదే: సీఎం మాఝి
● కీలకం కానున్న క్రాస్‌ఓటింగ్
భువనేశ్వర్: రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల ముఖచిత్రం దాదాపు స్పష్టమైంది. తొలి 3 స్థానాలు అధికార, విపక్షాలకు సొంతం కావడం తథ్యమైంది. మిగిలిన 4వ స్థానం చేజిక్కించుకునేందుకు అధికార భారతీయ జనతా పార్టీ, విపక్ష బిజూ జనతా దళ్ ఎవరి తరహాలో వారు భారీ స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ప్రముఖ యూరాలజిస్టు డాక్టరు దత్తేశ్వర హోతా ఉమ్మడి అభ్యర్థిగా విపక్ష బిజూ జనతా దళ్ ప్రకటించి నాలుగో స్థానం అభ్యర్థిగా పేర్కొంది. ఇందుకు కాంగ్రెసు పూర్తి స్థాయి మద్దతు స్వచ్చందంగా ప్రకటించింది. మరోవైపు అధికార పక్షం భారతీయ జనతా పార్టీ ప్రోత్సాహిత అభ్యర్థిగా దిలీప్ రే 4వ స్థానం కోసం పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ తనకు మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు బీజేపీ కేంద్ర ప్రముఖులతో సంప్రదింపులు పూర్తయ్యాయని అన్నారు.
హోరాహోరీ పోరు..
● నాలుగో రాజ్యసభ సీటు కోసం దిలీప్ రే, డాక్టర్ దత్తేశ్వర్ హోటా మధ్య పోటీ ప్రత్యక్ష పోరుగా రూపొందుతోంది. దిలీప్ రే సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రిగా రాజకీయ రంగంలో విశేష అనుభవజ్ఞుడిగా పేరొందారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ఈ నెల 5న రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు.
● రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు తీవ్రమైన రాజకీయ పోటీకి వేదికగా మారింది. బీజేపీ 2, బీజేడీ 1 స్థానం సునాయాశంగా కై వసం చేసుకునేందుకు శాసన సభలో బలం పుష్కలంగా ఉంది. ఈ స్థానాలకు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, సుజీత్ కుమార్‌లను నిలబెట్టింది. మరోవైపు బీజేడీ 3వ స్థానానికి సంతృప్త్ మిశ్రాను అభ్యర్థిగా ప్రకటించింది. డాక్టర్ దత్తేశ్వర్ హొత్తాను 4వ స్థానానికి ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించింది.
గెలిచి తీరుతాను: దిలీప్ రే
స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభ ఎన్నికల రంగంలోకి దిగిన దిలీప్ రే తన గెలుపు పట్ల గట్టి నమ్మకం వ్యక్తం చేశారు. విజయంపై నమ్మకం లేకపోతే నేను ఈ ఎన్నికల్లో నిలబడేవాడిని కాదన్నారు. అందరి మద్దతు కూడగట్టుకుని విజయం కై వసం చేసుకుంటానని చెప్పారు. బీజేపీ కేంద్ర నాయకత్వంతో సంప్రదింపులు పూర్తి అయ్యాయని, అన్ని పార్టీల నుంచి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నట్లు దిలీప్ రే ధీమా వ్యక్తం చేశారు.
● ఎగువ సభలో రాష్ట్ర స్వరాన్ని పదును పెట్టేందుకు బీజేపీ శతవిధాల ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలు ఫలప్రదం అవుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రగాఢ నమ్మకం వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన దిలీప్ రే అభ్యర్థిత్వానికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ సమీకరణం సంపన్న ఒడిశా, అభివృద్ధి చెందిన భారత దేశం నిర్మాణంలో సహాయపడుతుందన్నారు. త్వరలో జరగనున్న రాజ్య సభ ఎన్నికల్లో 4వ స్థానానికి ఏ పార్టీకి స్పష్టమైన సంఖ్యా బలం లేదు. అయిన దిలీప్ రే ఖచ్చితంగా గెలుస్తాడు, నాకు పూర్తి నమ్మకం ఉందని ముఖ్యమంత్రి అన్నారు.
● రాజ్య సభ 4వ స్థానం ఎన్నికలో క్రాస్ ఓటింగు కీలకమైన అంశం. సాదాసీదా పరిస్థితుల్లో బీజేపీ మద్దతు ప్రకటించిన స్వతంత్ర అభ్యర్థి దిలీప్ రే గెలిచేందుకు అవకాశం లేదు. తొలి 3 స్థానాలు కై వసం చేసుకున్న తర్వాత అధికార బీజేపీ, విపక్ష బీజేడీ ఖాతాలో మిగులు ఓట్లు 4వ స్థానం స్వతంత్రంగా చేజిక్కించుకోలేని పరిస్థితి స్పష్టమవుతుంది. ఈ స్థానం కోసం ఉమ్మడి అభ్యర్థిగా డాక్టరు దత్తేశ్వర్ హోతా, స్వతంత్ర అభ్యర్థిగా దిలీప్ రే హోరాహారీగా తలపడనున్నారు.
● బీజేడీ అభ్యర్థిగా సంతృప్త్ మిశ్రా 3వ స్థానం అభ్యర్థిగా ఖరారు అయ్యారు. 30 మంది బీజేడీ ఎమ్మెల్యేల ఓటుతో ఆయన గెలుపు తథ్యమనే చెప్పాలి. ఆ తర్వాత బీజేడీ ఖాతాలో 18 ఓట్లు మిగిలి ఉంటాయి. బీజేడీ ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థికి కాంగ్రెసు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఆ పార్టీ ఖాతాలో 14 స్పష్టమైన స్థానాలతో సీపీఐ (ఎం) 1 స్థానం మొత్తం మీద 15 స్థానాలు ఉన్నాయి. ఈ లెక్కన ప్రస్తుతానికి ఉమ్మడి అభ్యర్థి డాక్టరు దత్తేశ్వర గెలిచేందుకు మొత్తం 33 ఓట్లు నికరంగా ఉన్నాయి.
● తొలి 2 స్థానాలు కై వసం చేసుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ ఖాతాలో నామమాత్రంగా 22 ఎమ్మెల్యేల ఓట్లు మిగిలి ఉంటాయి. ఈ సంఖ్య తాము మద్దతు ప్రకటించిన దిలీప్ రే గెలిచేందుకు ఏమాత్రం ఉపకరించవని స్పష్టమవుతుంది. ఇటీవల బిజూ జనతా దళ్ ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది. వీరివురి మద్దతు కూడగట్టుకోగలిగిన బీజేపీ ఖాతాలో 24 ఓట్లు జమ అవుతాయి. అభ్యర్థిని గెలిపించేందుకు ఈ బలం చాలదు. అయినా తమ మద్దతు అభ్యర్థిగా దిలీప్ రే గెలుపు తథ్యమని భారతీయ జనతా పార్టీ ప్రముఖులు భావిస్తున్నారు. దీనిలో ఆంతర్యం రాజకీయ విశ్లేషకుల్లో చర్చనీయాంశమైంది.
● కాంగ్రెస్‌లో అసంతృప్తివాదుల్ని బుజ్జగించి తమ వైపు మలచుకుని 4వ స్థానం కై వసం చేసుకునే దిశలో అధికార బీజేపీ పావులు కదుపుతుందనే ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. బీజేడీ శిబిరంలో ప్రస్తుత ఎమ్మెల్యేల చిత్తశుద్ధి ఎంత వరకు సహకరిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. దీనివల్ల క్రాస్ ఓటింగ్ పోటీలో నిర్ణయాత్మక అంశంగా మారుతుంది.
● రాజ్యసభ ఎన్నికల ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 5తో నామినేషన్లు దాఖలు ఘట్టం ముగుస్తుంది. మర్నాడు 6న పరిశీలన పూర్తి చేసి ఖరారైన అభ్యర్థుల జాబితా వెల్లడిస్తారు. ఆ తర్వాత పోటీ నుంచి వైదొలిగేందుకు ఈ నెల 9 వరకు గడువు కల్పించారు. ఎట్టకేలకు ఈ నెల 16న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరవధికంగా ఓటింగ్ జరుగుతుంది. అనంతరం ఓట్లు లెక్కిస్తారు.


