మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలలను జిల్లా సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి బుధవారం సందర్శించారు. పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాల్లో నాణ్యత పాటించడం లేదని ఇటీవల నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో పలువురు ఫిర్యాదు చేశారు. స్పందించిన జిల్లా కలెక్టర్ సోమేశ్‌ణ్ ఉపాధ్యాయ్ ఆదేశాలతో సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి స్థానిక ఎక్స్‌బోర్డ్ పాఠశాలను సందర్శించి పిల్లలకు పెడుతున్న భోజన నాణ్యతను పరిశీలించారు. వంట చేసే ప్రాంతంలో శుభ్రతపై ఆరా తీశారు. భోజనం రుచి చూసి బాగుందన్నారు. విద్యార్థులకు పాఠాలు చెప్పి ఉత్సాహ పరిచారు. అలాగే పలు వసతి గృహాలను కూడా సబ్ కలెక్టర్ సందర్శించారు.
స్వాతంత్య్ర సమరయోధుడు
బిశ్వాసరాయ్‌కు ఘననివాళి
జయపురం: కొరాపుట్ గాంధీగా పేరుగాంచిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ మంత్రి స్వర్గీయ రాధాకృష్ణ బిశ్వాసరాయ్ సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. విశ్వాసరాయ్ 122వ జయంతిని జయపురం పూజ్య పూజా సంసద్ బుధవారం ఘనంగా నిర్వహించించింది. స్థానిక రెండవ దైనిక బజారు ప్రాంగణంలోని బిశ్వాసరాయ్ విగ్రహానికి పూజ్య పూజా సంసద్ అధ్యక్షులు, ఇంజినీర్ కేదార్ నాధ్ బెహర, ఇతర సభ్యులు పూల మాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బెహర మాట్లాడుతూ.. విశ్వాసరాయ్ దేశ స్వాతంత్య్ర సమరంలో పాల్గొని దేశం కోసం తన సంపదను, జీవితాన్ని దారపోశారని కొనియాడారు. అవిభక్త కొరాపుట్‌లో స్వాతంత్య్ర పోరాటానికి బీజం నాటి ప్రజలను దేశ విముక్తి పోరాటం వైపు నడిపించారని గుర్తు చేశారు. అలాగే రాష్ట్ర మంత్రిగా ఒడిశా అభివృద్ధికి కృషి చేశారన్నారు. అటువంటి పోరాట యోధుని జయంతిని అధికారులు విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పూజ్య పూజా సంసద్ కార్యదర్శి తపన్ కిరణ్ త్రిపాఠీ, కోశాధికారి బైరాగి జెన, సంసద్ సలహాదారు, జయపురం సబ్‌డివిజన్ రక్తదాతల మోటివేటెడ్ అసోసియేషన్ కార్యదర్శి ప్రమోద్ కుమార్ రౌళో తదితరులు పాల్గొన్నారు.


